ICC ODI Cricket World Cup 2023: భారత్ వేదికగా మరో 48 గంటల్లో వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు ఒక చేదు వార్త. ప్రపంచ కప్ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రారంభ వేడుకలు రద్దైనట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ భారత్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా ఓపెనింగ్ సెర్మనీని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఘనంగా నిర్వహిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు. వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 5న అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీనికి ఒక్క రోజు ముందు అంటే అక్టోబ‌ర్ 4న ఈ వేడుక‌ను నిర్వహించేందుకు బీసీసీఐ మొద‌ట ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేసింది.  ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లేలాంటి వాళ్లు పర్ఫామ్ చేయబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. 






అయితే.. తాజాగా ఈ ఓపెనింగ్ వేడుకలను ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్టోబ‌ర్‌ 14న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందుగానీ, లేదంటే టోర్నీ ముగిసిన త‌రువాత క్లోజింగ్ సెర్మనీని గానీ ఘనంగా నిర్వహించాల‌ని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వేడుకలు రద్దైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఓపెనింగ్ సెర్మనీ రద్దు విషయం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది.


కెప్టెన్స్ డే..
ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు ర‌ద్దు అయిన‌ప్పటికీ కెప్టెన్స్ డే ను య‌థావిధిగా నిర్వహించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌. వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో పాల్గొన‌నున్న మొత్తం 10 జ‌ట్ల కెప్టెన్లు అక్టోబ‌ర్ 3న అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. అక్టోబ‌ర్ 4న‌ ఫోటో సెష‌న్‌తో పాటు కెప్టెన్లు మీడియా స‌మావేశాల‌ను నిర్వహించనున్నారు. ప్రపంచ కప్ పోటీలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరో రెండు రోజుల్లో అక్టోబ‌ర్ 5న మొద‌టి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. 


లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వరల్డ్ కప్‌లోని అన్ని మ్యాచ్‌లు భారతదేశంలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌లో మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. మొబైల్ యాప్‌లో స్ట్రీమింగ్ ఫ్రీ కాగా, టీవీలో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.


ప్రపంచ‌క‌ప్‌లో కెప్టెన్లు వీరే..
ఇండియా : రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్
ఇంగ్లాండ్ : జోస్ బట్లర్
పాకిస్తాన్ : బాబర్ ఆజం
న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్
శ్రీలంక : దసున్ షనక
బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్
నెదర్లాండ్స్ : స్కాట్ ఎడ్వర్డ్స్
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా
అఫ్గానిస్తాన్ : హష్మతుల్లా షాహిది