భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌లో విజయం కోసం చివరి బంతి వరకు పోరాడే వ్యక్తి అశ్విన్‌ అని సచిన్‌ కొనియాడాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సచిన్‌ టెండూల్కర్‌తో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా సభ్యుడు. ఈ ప్రపంచకప్‌లో మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా వైదొలగడంతో అశ్విన్‌కు అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కింది. అశ్విన్ చాలా అనుభవజ్ఞుడని,  భారత్‌లో పిచ్‌లు ఎలా స్పందిస్తాయో తనకు బాగా తెలుసని.. ఆలాంటి ఆటగాడని ఏ జట్టు అంత తేలిగ్గా వదులుకోలేదని సచిన్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. ఆటపై అశ్విన్ వైఖరి, విధానం అద్భుతంగా ఉంటుందని క్రికెట్‌ గాడ్‌ అన్నాడు. 


భారత జట్టులో స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు ఎంతో అనుభవం ఉందని, తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ సచిన్‌ వ్యాఖ్యానించాడు. బౌలర్‌గా, బ్యాటర్‌గా చివరి బంతి వరకూ అశ్విన్‌ పోరాడుతాడని తెలిపాడు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు, ముగిసిన తర్వాత కూడా అతని దృష్టంతా ఆటపైనే ఉంటుందని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా అశ్విన్‌ను తాను ఎప్పుడూ ఇష్టపడతానన్న సచిన్‌..  అతను ఒక మంచి బ్యాట్సమెన్‌ కూడా అని వ్యాఖ్యానించాడు. 


స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ 2023లో భారత్‌ తొలుత జట్టులోకి ఎంపిక కాలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో అక్షర్‌ పటేల్‌ గాయపడడంతో అశ్విన్‌ను అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తుది జట్టులోకి తీసుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అశ్విన్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. చెన్నై వన్డేలోనూ 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్‌.. కేవలం 34 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 


 ప్రపంచకప్‌ ఆడుతున్న ఎక్కువ వయస్సున్న భారత క్రికెటర్ల జాబితాలోనూ అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. 38 ఏళ్ల 118 రోజుల వయసులో ప్రపంచ కప్‌లో పాల్గొన్న సునీల్ గవాస్కర్ ప్రపంచ కప్‌లో పాల్గొన్న అధిక వయసుగల భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. 38 ఏళ్ల వయసులో ఎంఎస్ ధోనీ తన చివరి వన్డే ప్రపంచకప్ కూడా ఆడాడు. మూడో స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతను 37 సంవత్సరాల వయస్సులో తన చివరి ODI ప్రపంచ కప్ ఆడాడు. ఫరూక్ ఇంజనీర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అశ్విన్‌ అయిదో స్థానంలో నిలిచాడు. 


 మరోవైపు ఆల్ టైం గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడైన సచిన్‌ భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌ చేరే జట్లేవో చెప్పేశాడు. ఈ మహా సంగ్రామంలో భారత్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నాకౌట్‌ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయని సచిన్‌ అంచనా వేశాడు. అయితే ఇందులో పాకిస్థాన్‌ జట్టు లేకపోవడం క్రికెట్‌ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ టూ స్థానంలో ఉన్న పాక్‌ సెమీఫైనల్‌కు కూడా చేరలేదన్న సచిన్‌ అంచనా ఆశ్చర్యపరుస్తోంది. భారత్‌ జట్టు సమతూకంగా ఉందన్న సచిన్‌.. మంచి ఫీల్డింగ్, వికెట్ల మధ్య బాగా పరుగెత్తే ఆటగాళ్లు ఆ జట్టు అదనపు బలమని అభిప్రాయపడ్డాడు.