ODI World Cup 2023, IND Vs AFG: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో నేడు భారత్‌, అఫ్గానిస్థాన్‌ తలపడుతున్నాయి. అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ సారథి షాహిది మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టీమ్‌ఇండియాను బౌలింగ్‌కు ఆహ్వానించాడు.


షాహిది, అఫ్గాన్‌ సారథి: మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. ఇది బ్యాటింగ్‌ పిచ్‌లా కనిపిస్తోంది. టీమ్‌ఇండియాను అడ్డుకోగల బౌలింగ్‌ లైనప్‌ మాకుంది. వికెట్‌ను ఉపయోగించుకుంటాం. బ్యాటింగ్‌లో తిరిగి పుంజుకుంటాం. మేమీ ప్రపంచకప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాం. మా ప్రతిభను చాటేందుకు ఇదో మంచి అవకాశం. జట్టులో ఎలాంటి మార్పుల్లేవ్‌.


రోహిత్‌ శర్మ, భారత సారథి: మేం లక్ష్యాన్ని ఛేదించాలనే అనుకున్నాం. ఇక్కడ మంచు కురుస్తుండటాన్ని మేం గత రాత్రి గమనించాం. వికెట్లో ఎక్కువ మార్పేమీ ఉండదు. మేం మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాలి. బ్యాటింగ్‌లో పటిష్ఠంగా ఉండాలి. తొలి మ్యాచులో మేం ఒత్తిడికి గురయ్యాం. కానీ కేఎల్‌, కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారి ప్రదర్శనను చూసి ఎంతో గర్విస్తున్నాం. ఏదేమైనా అదో సూపర్‌ మ్యాచ్‌. ఇందులోనూ గెలుస్తామనే అనుకుంటున్నా. అశ్విన్‌ ఆడటం లేదు. అతడి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ వస్తున్నాడు.


భారత్‌ జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌


అప్గానిస్థాన్‌ జట్టు: రెహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీమ్‌ జర్దాన్‌, రెహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, నజీబుల్లా జద్రాన్, మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, నవీన్‌ ఉల్‌ హఖ్‌, ఫజల్‌ హక్‌ ఫారుఖీ


పిచ్‌ రిపోర్టు: పిచ్‌ బెల్టర్‌లా ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు. వికెట్‌ బాగుందన్నాడు. ఈ వేదికలో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 230. కానీ శ్రీలంకతో మ్యాచులో దక్షిణాఫ్రికా 428 కొట్టింది. అందుకే 350 చేస్తే సులభంగా గెలవొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. మైదానం ఆకృతిని బట్టి ఆఫ్‌ స్పిన్నర్లకు కాస్త సవాలే.


తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్‌, ఇషాన్ కిషన్‌, శ్రేయస్స్‌ అయ్యర్ ఈ మ్యాచ్‌లో గాడిలో పడాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. బౌలర్లు సమర్థంగా రాణిస్తున్నా టాపార్డర్‌ వైఫల్యమే టీమిండియాను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరును ఛేదించే క్రమంలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. డెంగ్యూ కారణంగా  భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ రెండో మ్యాచ్‌కు కూడా దూరం కావడం రోహిత్‌ సేనకు ప్రతికూలంగా మారింది. శుభ్‌మన్ గిల్ దూరం కావడంతో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. బుమ్రా, సిరాజ్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌లతో భారత బౌలింగ్‌ దళం కూడా బలంగా ఉంది. ఈ బౌలింగ్‌ దాడిని తట్టుకుని అఫ్గాన్ నిలవడం కష్టమే అని మాజీలు అంచనా వేస్తున్నారు. అయితే ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని రోహిత్‌ భావిస్తే... అశ్విన్‌ స్థానంలో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండవు.