Temba Bavuma: 


ఐసీసీ ప్రపంచకప్‌ గెలిచేంత వరకు 'చోకర్స్‌' అనే పదం వినిపిస్తూనే ఉంటుందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా అంటున్నాడు. చాలామంది సఫారీ జట్టును ఇలా అనడం తనకు తెలుసన్నాడు. ఏదేమైనా మెగా టోర్నీ గెలిచేంత వరకు తమపై ఈ ట్యాగ్‌ పోదని వెల్లడించాడు. శ్రీలంకపై అద్భుతం విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'చాలా సంతోషంగా ఉంది. మేమీ మ్యాచ్‌ గెలవాలనుకున్నాం. అలాగే చేశాం. మా అద్భుత ప్రదర్శన తర్వాతి మ్యాచుకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి వేగంగా వస్తోంది. దానిని ప్రత్యర్థి జట్టు అనుకూలంగా ఉపయోగించుకుంది. భారత పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యం. టోర్నీ ద్వితీయార్ధంలో వైవిధ్యం కనిపిస్తుండొచ్చు. టోర్నీ సాగే కొద్దీ నేర్చుకుంటాం. పరిస్థితులకు అలవాటు పడతాం. తర్వాతి మ్యాచులో పిచ్‌ భిన్నంగా ఉంటుందని అనుకోను. క్వింటన్‌ డికాక్‌ తర్వాతి మ్యాచుకు అందుబాటులో ఉంటాడనే అనుకుంటున్నా' అని తెంబా బవుమా అన్నాడు.


చాన్నాళ్ల నుంచి చోకర్స్‌ పదం వింటున్నానని తెంబా అన్నాడు. తానూ రెండు మూడు సార్లు అన్నానని పేర్కొన్నాడు. అయితే తన జట్టు గురించి కాదన్నాడు. దీనిని నమ్మినవారికే ఈ పదం వరిస్తుందని తెలిపాడు. నమ్మని వాళ్లకు వర్తించదని స్పష్టం చేశాడు. 'జట్టు సభ్యులు ఏం నమ్ముతున్నారన్నదే మాకు ముఖ్యం. మేం చోకర్స్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఏదేమైనా మేం దీన్నుంచి బయటపడాలి' అని తెలిపాడు.


'ఏదేమైనా మేం ఈ చోకర్స్‌ కథనాన్ని నమ్మాల్సి ఉంటుంది. కనీసం నా వరకైనా నమ్మాలి. ప్రపంచకప్‌ గెలిచేంత వరకు దక్షిణాఫ్రికా భుజాలపై ఈ భారం ఉంటుంది. అప్పటి వరకు చోకర్స్‌ పదం నుంచి బయటపడలేం' అని తెంబా బవుమా అన్నాడు. దక్షిణాఫ్రికా తన తర్వాతి మ్యాచులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. అక్టోబర్‌ 12న మ్యాచ్‌ ఉంటుంది. 


శ్రీలంకతో జరిగిన మ్యాచులో సఫారీలు విజృంభించారు. ఏకంగా 102 పరుగులతో ప్రత్యర్థిని ఓడించాడు. రెండు జట్లు కలిసి 754 పరుగులు చేశాయి. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. 1975 నుంచి ప్రారంభమైన మెగాటోర్నీ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్‌ డెర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), అయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో లంకేయులను చీల్చిచెండాడారు. ఆఖర్లో క్లాసెన్‌ (32; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (39 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విజృంభించడంతో సఫారీ జట్టు రికార్డు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో మధుషనక రెండు వికెట్లు పడగొట్టాడు.


అనంతరం లక్ష్యఛేదనలో లంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో స్కోర్, వికెట్ల పతనం చూస్తే.. 200 పరుగులు మాత్రమే చేస్తుందనేలా కనిపించింన లంక.. చరిత అసలంక (64 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కుషాల్‌ మెండిస్‌ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్‌ డసున్‌ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడటంతో చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. సఫారీ బౌలర్లలో జాన్‌సెన్‌, గెరాల్డ్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ తలా 2 వికెట్లు పడగొట్టారు.