క్రికెట్‌ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే ప్రపంచకప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు అక్టోబర్‌ 14న జరగనుంది. ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన గుజరాత్‌ అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బెదిరింపుతో గుజరాత్ పోలీసులు మోదీ స్టేడియానికి భద్రత రెట్టింపు చేశారు. అణువణువు గాలిస్తున్నారు.

 

గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి చేస్తామని ముంబై పోలీసులకు ఈ మెయిల్‌ రావడంతో అహ్మదాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. 500 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలు నుంచి విడుదల చేయకపోతే నరేంద్ర మోదీ, స్టేడియంపై దాడి చేస్తామని ముంబై పోలీసులకు మెయిల్‌ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌ రావడంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అహ్మదాబాద్ పోలీసులు శనివారం తెలిపారు. ప్రజలు, క్రికెట్‌ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మ్యాచ్‌ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్ చిరాగ్ కొరాడియా తెలిపారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని.. దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశామని వివరించారు. గుర్తుతెలియని వ్యక్తి చేసిన బెదిరింపు మెయిల్‌పై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

 

అక్టోబర్ 5న ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు కూడా పటిష్ట భద్రత కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే హోటళ్లు, దాబాలు, గెస్ట్ హౌస్‌లతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. స్టేడియం ప్రవేశ ద్వారాలకు సీసీ కెమెరాలు అమర్చి ప్రతి కార్యకలాపాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం అక్టోబరు 11 నుంచే భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్న కొరాడియా.. అన్ని తనిఖీలు చేయడంతోపాటు సంఘ విద్రోహశక్తులపై నిఘా ఉంచుతామని తెలిపారు. 

అక్టోబర్ 5న ICC క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌కు కూడా ఇలాంటి బెదిరింపే వచ్చింది. ఈ బెదిరింపులతో మొతేరా, అహ్మదాబాద్‌ సహా చాలా ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు. క్రికెట్ ప్రపంచ కప్‌ను 'వరల్డ్ టెర్రర్ కప్'గా మారుస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేసిన  నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుపై గుజరాత్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 

 

అక్టోబర్ 14న ప్రపంచకప్‌లో భారత్‌-పాక్ తలపడబోతున్నాయి. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌పై అందరి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మ్యాచ్‌ కోసం క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోటల్ ఛార్జీలు ఇప్పటికే 10 రెట్లు అయ్యాయి.