ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు.  ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే  వన్డే ప్రపంచకప్‌కు ముందే  రేపట్నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో ఆడేందుకు సిద్ధమైన టీమిండియా.. నేడు శ్రీలంక వెళ్లనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు సెలక్షన్ ప్రాసెస్,  వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్‌, తదితర విషయాలపై స్పందించాడు. రోహిత్  కామెంట్స్ అతడి మాటల్లోనే.. 


వరల్డ్ కప్ సన్నద్దతపై.. 


నా వరకు ప్రపంచకప్‌కు ముందు గత వరల్డ్ కప్‌ (2019)కు ముందు ఎలా ఉన్నానో అలా ఉండాలనుకుంటున్నా. అప్పుడు నేను క్రికెటర్‌గానే గాక వ్యక్తిగా కూడా చాలా సానుకూల దృక్ఫథంతో ఉన్నా.  మానసికంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నా. ఆ సమయంలో నేను  చేసిన పనులేంటో గుర్తుచేసుకోవడానికి యత్నిస్తున్నా. (ఇంగ్లాండ్ లో జరిగిన 2019 వన్డే వరల్డ్ కప్‌లో  రోహిత్ 648 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి) 


టీమ్ సెలక్షన్ గురించి.. 


మేం అత్యుత్తమ టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో పలువురు కీలక ఆటగాళ్లనూ పక్కనబెట్టాల్సి వస్తుంది.  దాని గురించి నేను, రాహుల్ ద్రావిడ్..  చోటు కోల్పోయిన ఆటగాడికి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తాం.   ఒక్కో ప్లేయర్‌తో కూర్చుని మాట్లాడతాం. మ్యాచ్ పరిస్థితులు,   మేం తలపడబోయే ప్రత్యర్థి,  పిచ్‌ స్వభావం,  బలాలు బలహీనతలను అంచనా వేసుకుని  ఒక సమిష్టి అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.  అయితే మా నిర్ణయాలన్నీ  విజయవంతమవుతాయని మేం చెప్పడం లేదు.   మేమూ తప్పులు చేస్తాం.  నా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ఆటగాళ్ల ఎంపిక ఉండదు. ఒక ఆటగాడికి ఫైనల్ లెవన్‌లో ఎందుకు చోటు దక్కలేదనే విషయంపై అతడికి  ముందే వివరంగా చెప్తాం..


 






ఆ బాధ నాకు తెలుసు.. 


వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కకపోతే  ఆ బాధ ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవించినవాడినే. నేను వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా.  2011 వరల్డ్ కప్‌ సందర్భంగా భారత జట్టులో నాకు చోటు దక్కనప్పుడు చాలా కుంగుబాటుకు లోనయ్యా. అప్పుడు నా గుండె పగిలినట్టు అనిపించింది. వరల్డ్ కప్ లో చోటు కోల్పోతే ఇక నా కెరీర్ ముగిసినట్టే భావించా. ఏం చేయాలో తెలియలేదు.  అప్పుడు యువరాజ్ సింగ్ నా దగ్గరకు వచ్చి ఓదార్చాడు. నన్ను తన గదికి డిన్నర్‌కు తీసుకెళ్లాడు. వరల్డ్ కప్ టీమ్‌లో ఎంపిక కాకుంటే అంతా అయిపోనట్టు కాదని,  నాలో చాలా ఏళ్ల క్రికెట్  దాగి ఉందని ధైర్యం చెప్పాడు.  నా స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సలహా ఇచ్చాడు. ప్రపంచకప్ లో ఎంపిక కానంత మాత్రానా మళ్లీ అవకాశం రానట్టు కాదని, ఏదో ఒకరోజు ఆ అవకాశం తప్పకుండా వస్తుందని నాకు చెప్పాడని రోహిత్  వ్యాఖ్యానించాడు. 











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial