Asia Cup 2023: ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలు ముందున్న  నేపథ్యంలో శ్రీలంక గాయాలతో సతమతమవుతున్నది.  ఆ జట్టు బౌలర్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతూ టీమ్‌కు దూరమవుతున్నారు. రేపటి నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే ఆసియా కప్ ప్రారంభానికి ముందే  ఆ జట్టుకు చెందిన  నలుగురు బౌలర్లు గాయపడ్డారు. ఇదివరకే స్టార్ పేసర్ దుష్మంత చమీర,  లాహిరు కుమారతో పాటు  స్పిన్నర్ వనిందు హసరంగ గాయాలతో జట్టుకు దూరమవగా తాజాగా ఆ జాబితాలో యువ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా  ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. 


లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్  మధుశంక గత శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మధుశంక కాలి కండరానికి గాయమైంది. అతడిని పరీక్షించిన వైద్య బృందం.. మధుశంకకు విశ్రాంతి అవసరమని తేల్చడంతో  అతడు ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ యువపేసర్ గాయం వరల్డ్ కప్ వరకు మానుతుందా..? అన్నది అనుమానంగానే ఉంది.  అదే జరిగితే లంకకు  ప్రపంచకప్‌లో భారీ షాక్ తప్పదు. 


ఇప్పటికే లంక జట్టులో  రైట్ ఆర్మ్ పేసర్ దుష్మంత చమీర గాయంతో ఆసియా కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చమీర గాయం తీవ్రతను బట్టి  చూస్తే అతడు కూడా వరల్డ్ కప్ వరకు కోలుకునేది కష్టమేనని తెలుస్తున్నది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ  తొడ కండరాల గాయంతో ఆసియా కప్ ‌కు దూరంగా ఉన్నాడు. లాహిరు కుమారదీ అదే పరిస్థితి.  ఈ నలుగురూ లంక బౌలింగ్  దళానికి కీలకంగా ఉన్నవారే.. వీరిలో చమీరతో పాటు మధుశంకలు గతేడాది యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్ (టీ20 ఫార్మాట్)లో  శ్రీలంక బౌలింగ్‌కు నాయకత్వం వహించి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మరి ఈ నలుగురు ఆసియా కప్ తర్వాత ఎంత త్వరగా కోలుకుంటారనేది ఆ జట్టుకు కీలంక కానుంది. 


 






రేపట్నుంచి మొదలుకాబోయే ఆసియా కప్‌లో శ్రీలంక ఇంకా తమ జట్టును అధికారికంగా ప్రకటించలేదు.   15 మందితో కూడిన జట్టును శ్రీలంక బోర్డు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. కానీ క్రీడా శాఖ ఇంకా దానికి ఆమోదముద్ర వేయలేదు.  నేటి  సాయంత్రం వరకు లంక జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 


శ్రీలంక బోర్డు ఫైనల్ చేసిన జట్టు : దసున్ శనక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ పెరెరా, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, దుశన్ హేమంత, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుశాన్, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక, మతీశ పతిరాన 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial