Asia Cup 2023: మరో నెల రోజుల్లో మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ జరుగనున్నది. రేపటి (ఆగస్టు 30) నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకాబోతుంది. ఏడుసార్లు ఆసియా కప్ నెగ్గిన భారత జట్టు మరోసారి ఈ ట్రోఫీని దక్కించుకుని ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని భావిస్తున్నది. ఇక టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు కూడా ఈ టోర్నీ కీలకంగా మారనుంది. ఈ ఇద్దరూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ అరుదైన రికార్డు మీద కన్నేశారు.
సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) లో 971 పరుగులు సాధించాడు. 1990 నుంచి 2012 వరకూ ఆసియా కప్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన సచిన్.. 21 ఇన్నింగ్స్‌లలో 51.10 సగటుతో 971 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. భారత్ తరఫున ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా టెండూల్కరే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించడానికి రోహిత్, కోహ్లీలకు సువర్ణావకాశం దక్కింది.
వన్డేలలో మాస్టర్ బ్లాస్టర్ తర్వాత ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ ఆసియా కప్‌లో ఇప్పటివరకూ 22 మ్యాచ్‌లు ఆడి 21 ఇన్నింగ్స్‌లలోనే 786 రన్స్ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ సగటు ఏకంగా 65.50గా నమోదైంది. ఆసియా కప్ లో రోహిత్.. మూడు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు కూడా సాధించాడు. సచిన్ రికార్డును అధిగమించడానికి రోహిత్‌కు 226 పరుగులు అవసరమున్నాయి.
ఇక కోహ్లీ విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఆసియా కప్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 10 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి 613 పరుగులు సాధించాడు. కోహ్లీ సగటు కూడా 61.30గా నమోదైంది. ఆసియా కప్‌లో కోహ్లీ 3 శతకాలు, ఒక అర్థ సెంచరీ సాధించాడు. సచిన్ రికార్డును అధిగమించడానికి కోహ్లీకి 358 పరుగులు కావాల్సి ఉంది.
ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే భారత్.. సూపర్ - 4లో కూడా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఐదో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంటుంది. ఐదు మ్యాచ్‌లలో సచిన్ రికార్డును అధిగమించడం ఈ ఇద్దరికీ పెద్ద సమస్య కాదు. అదీగాక రోహిత్, కోహ్లీలు మంచి టచ్‌లో ఉన్నారు. ఫామ్ కొనసాగిస్తే మాస్టర్ బ్లాస్టర్ రికార్డు కనుమరుగు కావడం ఖాయమని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు (టాప్-5):
సచిన్ టెండూల్కర్ - 971
రోహిత్ శర్మ - 745
ఎంఎస్ ధోని - 648
విరాట్ కోహ్లీ - 613
గౌతం గంభీర్ - 573
ఓవరాల్‌గా టాప్ - 5 బ్యాటర్లు వీళ్లే :
సనత్ జయసూర్య (శ్రీలంక) - 1,220
కుమార సంగక్కర (శ్రీలంక) -1,075
సచిన్ టెండూల్కర్ - 971
షోయభ్ మాలిక్ - 786
రోహిత్ శర్మ - 745
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial