IPL 2025 RR VS GT Result Update: ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన రాజస్థాన్ రాయల్స్ విశ్వరూపం ప్రదర్శించింది. గత మూడు మ్యాచ్ ల్లో చేజింగ్ లో విఫలమైన ఆ జట్టు.. సోమవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది. సొంతగడ్డ జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో పర్యాటక గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. టీనేజర్ వైభవ్ సూర్యవంశీ లీగ్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) తో సత్తా చాటడంతో ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహీషా తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం సూర్యవంశీ జోరుతో ఛేదనలో రాయల్స్ కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది.
భారీ భాగస్వామ్యం.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్ (39), గిల్ చక్కని ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి పవర్ ప్లేలో 53 పరుగులు జోడించారు. ఇరువురు బౌండరీలతో డీల్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దీంతో ఫస్ట్ వికెట్ కు 93 పరుగులు జోడించారు. ఈ దశలో భారీ స్కోరు కు ప్రయత్నించిన సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఫిఫ్టీతో చెలరేగాడు. మరో ఎండ్ లో గిల్ కూడా గేర్ మర్చాడంతో పరుగులు వేగంగా వచ్చాయి. వీరిద్దరూ రెండో వికెట్ కు 74 పరుగులు జోడించడంతో మంచి పునాది పడింది. ఈక్రమంలో 29 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్న గిల్.. సెంచరీకి చేరువైన తరుణంలో ఔటయ్యాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన బట్లర్.. 26 బంతుల్లో ఫిఫ్టీ చేసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
సూపర్ సెంచరీ.. అరంగేట్రం నుంచి దూకుడుగా ఆడుతూ, ఆకట్టుకుంటున్న వైభవ్.. ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. దీంతో స్కోరు బోర్డు వేగంగా పరుగెలెత్తింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వైభవ్ చెలరేగడంతో పవర్ ప్లేలో 87 పరుగులు వచ్చాయి. అంతకుముందే 17 బంతుల్లోనే ఫిఫ్టీ ని వైభవ్ బాదాడు. ఆ తర్వాత కూడా చెలరేగి ఆడుతూ, మరో 18 బంతుల్లో ఐపీఎల్లో తొలి సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. మరో ఎండ్ లో జైస్వాల్ కూడా ధాటిగా ఆడి, 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్ కు 71 బంతుల్లోనే 166 పరుగులు జోడించాక, వైభవ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీశ్ రాణా (4) విఫలమైనా, కెప్టెన్ రియాన్ పరాగ్ (32 నాటౌట్) తో కలిసి జట్టును జైస్వాల్ విజయతీరాలకు చేర్చాడు.