NED Vs NZ, Innings Highlights:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ సూపర్ డూపర్ ఫామ్‌లో కనిపిస్తోంది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచులోనూ భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7x4, 2x6), రచిన్ రవీంద్ర (51; 51 బంతుల్లో 3x4, 1x6), టామ్ లేథమ్ (53; 46 బంతుల్లో 6x4, 1x6) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (36; 17 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నెదర్లాండ్స్‌లో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్, రోయిలెఫ్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (32), విల్ యంగ్ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. 12.1వ బంతికి కాన్వేను ఔట్ చేయడం ద్వారా మెర్వ్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కివీస్ రెచ్చిపోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి యంగ్ అదరగొట్టాడు. 59 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు 84 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో కివీస్ 27.5 ఓవర్లకు 150కి చేరుకుంది. జట్టు స్కోరు 144 వద్ద యంగ్, 185 వద్ద రవీంద్ర ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ సిచ్యువేషన్లో డరైల్ మిచెల్ (48), టామ్ లేథమ్ కివీస్‌ను ముందుకు తీసుకెళ్లారు. చూడచక్కని షాట్లు ఆడారు. ఆఖర్లో మిచెల్ శాంట్నర్ 17 బంతుల్లోనే 36 పరుగులు చేయడంతో కివీస్ స్కోరు 322కు చేరుకుంది.
న్యూజిలాండ్: డేవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డరైల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
నెదర్లాండ్స్: విక్రమ్‌సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మన్, బాస్ డి లీడ్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్‌వర్డ్స్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెట్చ్, రాయిలెఫ్ వాన్‌డర్ మెర్వ్, రియాన్ కెలిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్
స్కాట్ ఎడ్‌వర్డ్స్, నెదర్లాండ్స్ సారథి: మేం మొదట బౌలింగ్ చేస్తాం. చివరి మ్యాచ్‌తో పోలిస్తే బౌలింగ్ పరిస్థితులు మెరుగయ్యాయని అనిపిస్తోంది. పైగా మంచు కురిసే అవకాశం లేదు. మేం మంచి ప్రాంతంలో ఉన్నాం. జట్టులో రెండు మార్పులు చేశాం. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్, రియాన్ క్లెయిన్ వచ్చారు.
టామ్ లేథమ్, కివీస్ సారథి: మేమూ మొదట బౌలింగే చేయాలనుకున్నాం. పిచ్ బాగుంది. ఇదే వికెట్‌పై మేం గతవారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. పరుగులు చేశాం. చివరి మ్యాచులో మా ఆటతీరు ఎంతో నచ్చింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. డేవాన్, రచిన్ బ్యాటింగులో అదరగొట్టారు. జేమ్స్ నీషమ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ వస్తున్నాడు.