Ravindra Jadeja:
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఔటవ్వడమే మ్యాచులో టర్నింగ్ పాయింటని టీమ్‌ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అంటున్నాడు. భారత వికెట్లు, పరిస్థితులపై అతడికి మంచి అనుభవం ఉందన్నాడు. అతడు గనక మరికాసేపు క్రీజులో ఉంటే ఆసీస్ మరింత పెద్ద స్కోరు చేసేదని అంచనా వేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచులో టీమ్‌ఇండియా గెలిచాక అతడు మీడియాతో మాట్లాడాడు.
'స్టీవ్ స్మిత్ ఔటవ్వడమే మ్యాచులో టర్నింగ్ పాయింట్. అతడిలాంటి బ్యాటర్ ఔటయ్యాక కఠినమైన పిచ్‌పై కొత్త బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయలేరు. అందుకే అతడు ఔటవ్వడమే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అంటున్నాను. చెన్నై పరిస్థితులపై అవగాహన ఉండటమూ నాకు సాయపడింది. 10-11 ఏళ్ల నుంచీ నేనిక్కడ ఆడుతున్నాను. మైదానం ఎలా ఉంటుందో తెలుసు. జట్టుకు నా వంతు సాయం చేసినందుకు హ్యాపీగా అనిపిస్తోంది' అని జడ్డూ అన్నాడు.
స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై బౌలింగ్ చేయడం సులభమని రవీంద్ర జడేజా అంటున్నాడు. తన అనుభవంతో స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేసి ఫలితం సాధించానని చెప్పాడు. 'నేను మొదటి ఓవర్ వేస్తున్నప్పుడు బంతి పిచ్ అయ్యాక ఆగి వస్తుండటం గమనించాను. పైగా మధ్యాహ్న సమయం. ఎండ ఎక్కువగా ఉంది. వికెట్ మందకొడిగా ఉంది. అందుకే స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయడం మంచిదని అనుకున్నాను. అక్కడ్నుంచి కొన్ని బంతులు టర్న్ అయ్యాయి. కొన్ని నేరుగా వెళ్లాయి. అంచనా వేయకుండా బంతులు వస్తున్నప్పుడు బ్యాటింగ్ చేయడం కష్టం. నా ప్లాన్ ఇదే. లక్కీగా స్మిత్ వేసిన బంతి చక్కగా టర్న్ అయి వికెట్లను తాకేసింది. చెన్నై పిచ్ టెస్టు మ్యాచ్ బౌలింగ్ వికెట్‌లాగా అనిపించింది. అందుకే నేనెలాంటి ప్రయోగాలు చేయలేదు' అని జడ్డూ తెలిపాడు.
ఛేదనలో టీమ్ఇండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో కొంత ఆందోళనకు గురయ్యామని జడేజా అన్నాడు. 'రెండు మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడితే ఎవరైనా కొంత భయపడతారు. కానీ మాకు రాహుల్, విరాట్ కోహ్లీ గురించి తెలుసు. కొన్నేళ్లుగా జట్టు కోసం వాళ్లిలాంటి పరిస్థితుల్లో పోరాడి గెలిపించారు. అందుకే ఆ పరిస్థితుల్లో ఎవరూ అతిగా ఆందోళన చెందలేదనే అనుకుంటున్నా. అదృష్టవశాత్తు వారిద్దరూ చక్కగా ఆడారు. ఈ పరిస్థితులపై వారికి బాగా అవగాహన ఉంది. అందుకే బాగా ఆడి మ్యాచును ముందుకు తీసుకెళ్లారు. జట్టును గెలిపించారు' అని జడేజా వివరించాడు.