NED vs NZ: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సోమవారం ఆరో మ్యాచ్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానంలో  నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.


స్కాట్ ఎడ్‌వర్డ్స్, నెదర్లాండ్స్‌ సారథి: మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. చివరి మ్యాచ్‌తో పోలిస్తే బౌలింగ్‌ పరిస్థితులు మెరుగయ్యాయని అనిపిస్తోంది. పైగా మంచు కురిసే అవకాశం లేదు. మేం మంచి ప్రాంతంలో ఉన్నాం. జట్టులో రెండు మార్పులు చేశాం. సైబ్రాండ్‌ ఎంగెల్‌బ్రెచ్‌, రియాన్‌ క్లెయిన్‌ వచ్చారు.


టామ్‌ లేథమ్‌, కివీస్‌ సారథి: మేమూ మొదట బౌలింగే చేయాలనుకున్నాం. పిచ్‌ బాగుంది. ఇదే వికెట్‌పై మేం గతవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాం. పరుగులు చేశాం. చివరి మ్యాచులో మా ఆటతీరు ఎంతో నచ్చింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. డేవాన్‌, రచిన్‌ బ్యాటింగులో అదరగొట్టారు. జేమ్స్‌ నీషమ్‌ స్థానంలో లాకీ ఫెర్గూసన్‌ వస్తున్నాడు.


న్యూజిలాండ్‌: డేవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డరైల్‌ మిచెల్‌, టామ్‌ లేథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, మిచెల్‌ శాంట్నర్‌, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌


నెదర్లాండ్స్‌: విక్రమ్‌సింగ్‌, మాక్స్‌ ఓడౌడ్‌, కొలిన్‌ అకెర్‌మన్‌, బాస్‌ డి లీడ్‌, తేజా నిడమనూరు, స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌, సైబ్రాండ్‌ ఎంగెల్‌బ్రెట్చ్‌, రాయిలెఫ్‌ వాన్‌డర్‌ మెర్వ్‌, రియాన్‌ కెలిన్‌, ఆర్యన్‌ దత్‌, పాల్‌ వాన్‌ మీకెరన్‌


నెదర్లాండ్స్‌ ఆశలు

నెదర్లాండ్స్‌ తనదైన రోజున ఎంత పెద్ద జట్టుకైన షాక్‌ ఇవ్వగలదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బౌలర్లు పాక్‌ బ్యాటర్లను ఆలౌట్‌ చేశారు. బ్యాటింగ్‌లోనూ సమర్థంగా రాణించారు. అనుభవలేమితో పాక్‌తో జరిగిన పోరులో నెదర్లాండ్స్ పరాజయం పాలైనా వారి ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. భారత సంతతి ఆటగాళ్లు డచ్‌ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్‌సింగ్‌, తేజ నిడమనూరు నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ బారాన్ని మోస్తున్నారు. బౌలింగ్‌లోనూ నెదర్లాండ్స్‌ జట్టు పర్వాలేదనిపిస్తుంది. ఉప్పల్‌లో పాక్‌తో ఒక మ్యాచ్‌ ఆడడంతో ఈ పిచ్‌ ఎలా స్పందిస్తుందన్న దానిపై నెదర్లాండ్స్ జట్టుకు ఓ అంచనా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు గట్టిపోటీ ఇవ్వాలని డచ్‌ జట్టు పట్టుదలతో ఉంది. 

 

విలియమ్సన్‌ దూరం

తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన కివీస్‌ సారధి కేన్‌ విలియమ్సన్.. రెండో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. విలియమ్సన్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడన్న గ్యారీ స్టెడ్‌... కానీ అతడు పూర్తిగా కోలుకోవాల్సి ఉందని తెలిపాడు. రెండో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్‌ దూరంగా ఉంటాడని, కానీ మూడో మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు కివీస్ హెడ్‌ కోచ్‌ తెలిపాడు. కేన్‌ త్వరగా కోలుకుని ఈ మెగా టోర్నీలో జట్టుతో కలవాలనే తాము కోరుకుంటున్నామని వివరించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవట్లేదన్న కివీస్‌ కోచ్‌.. పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.