స్వదేశంలో జరుగుతున్న తొలి ప్రపంచకప్‌లో భారత్‌కు శుభారంభం అందించిన కోహ్లీ ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో 85 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఆకట్టుకున్నాడు. ICC నిర్వహించే ప్రపంచ కప్, T2 0 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అర్ధశతకం సాధించిన రన్‌మెషీన్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.
సచిన్ పేరున ఉన్న రికార్డ్ బద్దలు
ఈ రికార్డు గతంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరున ఉండేది. సచిన్ ICC టోర్నమెంట్‌లలో 58 మ్యాచ్‌లు ఆడి 2, 718 పరుగులు చేశాడు. ఈ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. కోహ్లి 64 మ్యాచ్‌ల్లో 2,785 పరుగులు చేశాడు. సచిన్ కంటే కోహ్లీ 14 మ్యాచ్‌లు ఎక్కువ ఆడడం గమనార్హం. సచిన్ టీమిండియా తరఫున ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడగా.. కోహ్లి ప్రస్తుతం నాలుగోది ఆడుతున్నాడు. అయితే, కింగ్ కోహ్లి ఐదు టీ20 వరల్డ్‌కప్స్ సహా మూడు ఛాంపియన్ ట్రోఫీలు ఆడాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 62 మ్యాచుల్లో 2, 422, యువరాజ్ సింగ్ 62 మ్యాచుల్లో 1707, సౌరవ్ గంగూలీ 32 మ్యాచుల్లో 1671, మహేంద్ర సింగ్ ధోని 1492 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సాగిందిలా..
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు) జట్టును విజయ పథం వైపు నడిపించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) అత్యధిక స్కోరు సాధించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలో భారీ షాకులు తగిలాయి. మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్, రెండో ఓవర్లో రోహిత్ శర్మ, శ్రేయస్స అయ్యర్ పెవిలియన్ బాట పట్టించాడు. భారత్ కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ కోలుకోవడం కష్టమే అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు), కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) మాత్రం అదరగొట్టారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించి భారత్‌కు విజయాన్ని అందించారు.
డేవిడ్ వార్నర్ (41: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు), స్టీవ్ స్మిత్ (46: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) సమయోచితంగా ఆడడంతో ఆస్ట్రేలియా 199 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్‌ను కుల్‌దీప్ యాదవ్ అవుట్ చేశాడు. వరుస ఓవర్లలో జడ్డూ మూడు వికెట్లు తీసి కంగారూలకు షాకిచ్చాడు. 165 పరుగులకేకే కంగారూలు 8 వికెట్లు చేజార్చుకున్నారు. ఆఖర్లో మిచెల్ స్టార్క్ పోరాటంతో ఆసీస్ స్కోరు 199కి చేరుకుంది.