Shubman Gill: డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు కూడా దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్/ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయాడు.


శుభ్‌మన్ గిల్ చెన్నైలోనే ఉండనున్నారు. భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లబోవడం లేదు. చెన్నైలోని మెడికల్ టీమ్ శుభ్‌మన్ గిల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించనుంది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత భారత్... పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు అయినా గిల్ అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి.


ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా శుభ్‌మన్ గిల్‌ ఆడలేకపోయాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించారు. కానీ ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. తన మొదటి బంతికే డకౌట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.


తదుపరి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో...
2023 ప్రపంచకప్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య అక్టోబర్ 11వ తేదీన పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసింది. ముగ్గురు ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.


నంబర్ 2 స్థానంలో గిల్
ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నంబర్-2 బ్యాట్స్‌మెన్. ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగులు చేశాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును గిల్ బద్దలు కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా డెంగ్యూ రావడంతో గిల్ ఎప్పుడు తిరిగి జట్టులోకి వస్తాడో అన్నది క్లారిటీ లేకుండా పోయింది.


మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా ఐదో స్థానంలో ఉంది. కానీ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు మీద మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం ఇదే తొలి సారి.


ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial