ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ ఆడేందుకు గాను ఇదివరకే దాదాపు అన్ని దేశాల ఆటగాళ్లు ఉపఖండంలో అడుగుపెట్టారు. కానీ పొరుగుదేశమే అయినా పాకిస్తాన్ మాత్రం ఇంకా రాలేదు. నిన్నా మొన్నటి దాకా వీసాల సమస్య కారణంగా దుబాయ్ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకుని అసలు వీసాలు వస్తాయా..? రావా..? అన్న అనుమానంలో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్లకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. బాబర్ సేనకు వీసా సమస్యలు తీరిపోయాయి. బుధవారం పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో ల్యాండ్ అవనుంది.
పాకిస్తాన్ జట్టు బుధవారం భారత్‌కు రావాల్సి ఉండగా సోమవారం ఉదయానికి కూడా ఇండియా వీసాల జారీ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో పీసీబీ ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఐసీసీ జోక్యంతో సాయంత్రం వరకు సమస్య సద్దుమణిగింది. పాక్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
వాస్తవానికి పాకిస్తాన్ గతవారం టీమ్ బాండింగ్ పేరుతో దుబాయ్‌లో ఓ ప్రత్యేక ట్రిప్ ప్లాన్ చేసింది. కానీ వీసాల సమస్య కారణంగా చివరినిమిషంలో ఈ ట్రిప్ క్యాన్సిల్ అయింది. తాజాగా వీసా సమస్యలు తీరడంతో పాకిస్తాన్.. బుధవారం సాయంత్రానికల్లా హైదరాబాద్‌కు చేరుకుంటుంది. శుక్రవారం (సెప్టెంబర్ 29) ఆ జట్టు ఉప్పల్ స్టేడియం వేదికగా వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు.
2016 తర్వాత ఇదే మొదటిసారి..
ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యల నేపథ్యంలో భారత్ - పాక్‌లు చాలాకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం పక్కనబెట్టాయి. 2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ 2012లో చివరిసారిగా ఇక్కడ పర్యటించింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆడుతుండటం ఇదే రెండోసారి మాత్రమే. 2016లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన పాక్.. మళ్లీ ఏడేండ్లకు భారత్‌లో అడుగుపెడుతోంది. అయితే ఇవి రెండూ ఐసీసీ టోర్నీలే కావడం గమనార్హం.
వన్డే వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసమ మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం