Asian Games 2023: క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ  ఉండే భారత్ వంటి దేశంలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూడటానికి అభిమానులు  ఎక్కడికైనా వెళ్తారు.  ఇందులో వింతేమీ లేదు.  కానీ అసలు  క్రికెట్ గురించి  ఇంకా అ, ఆలు నేర్చుకునే దశలో ఉన్న   చైనాలో కూడా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారా..?   అంటే  నేను ఉన్నాగా అంటున్నాడు  ఆ దేశ అభిమాని. అది కూడా ఏ విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మ ఆట చూడటానికో కాదండోయ్.. భారత మహిళా క్రికెట్ జట్టు సూపర్ స్టార్  స్మృతి మంధాన ఆటను చూడటానికి..  టీమిండియా ఓపెనర్ ఆటను అభిమానించే  జున్ యు, ఆమె ఆటను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడట.. 


ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ  క్రీడలలో భారత క్రికెట్ జట్టు తొలిసారి పాల్గొంటున్నది.  నిన్న ముగిసిన  మహిళల ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. శ్రీలంకపై 19 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. భారత బ్యాటర్లు విఫలమైన చోట  మంధాన (46), రోడ్రిగ్స్ (42)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.  అయితే ఈ మ్యాచ్‌లో మంధాన ఆట చూసేందుకు గాను ఆమె అభిమాని అయిన జున్ యు.. బీజింగ్ నుంచి హాంగ్జౌ (1,200 కిలోమీటర్లు) వచ్చాడు.  సోమవారం  భారత్ - లంక మ్యాచ్ జరుగుతున్న క్రమంలో  ఈ  కుర్రాడు  ‘మంధాన, ది గాడెస్’ అని ఫ్లకార్డు పట్టుకుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.


మంధాన ఆట చూసేందుకు వచ్చిన జున్ యూ  పీటీఐతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్లంటే ఇష్టమని, కానీ ఈ ఆటలో సచిన్ టెండూల్కర్ లెజెండ్ అని  చెప్పాడు. జున్ యు మాట్లాడుతూ.. ‘నేను 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్‌పై  బుమ్రా వేసిన స్పెల్ చూశాను.  భారత క్రికెట్  సారథి రోహిత్ శర్మ,  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను నేను ఫాలో అవుతా..  ప్రస్తుతం క్రికెట్‌లో వాళ్లిద్దరూ దిగ్గజాలు. అంతేకాదు నేను సూర్యకుమార్ యాదవ్ ఆటకూ అభిమానినే.. న్యూజిలాండ్  కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆట అంటే చాలా ఇష్టం.  కానీ ఈ ఆటలో  లెజెండ్ సచిన్ టెండూల్కర్.






బీజింగ్‌లోని నేను చదువుతున్న  యూనివర్సిటీలో క్రికెట్ పాఠాలు కూడా చెబుతారు.   అందుకే నాకు క్రికెట్ గురించి కొద్దిగా అవగాహన ఉంది.   చైనాలో క్రికెట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  ఇక్కడ క్రికెట్ స్టేడియాలూ చాలా తక్కువ.   చాలామందికి ఈ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు. 2010లో గాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇక్కడ క్రికెట్ ఆడారు కాబట్టి అక్కడ పర్మనెంట్ క్రికెట్ స్టేడియం ఉంది. మిగతా ప్రాంతాల్లో  అలాంటివేమీ లేవు.   ఒకవేళ నేను క్రికెట్ ఆడదామనుకున్న అందుకు తగ్గ వసతులు ఇక్కడ లేవు. ఇప్పుడు హాంగ్జౌలోని ఈ ఫింగ్‌ఫెంగ్ గ్రౌండ్ కూడా గతంలో లేదు. ఈ ఆసియా క్రీడల కోసమే దీనిని సిద్ధం చేశారు. ఇక్కడ కొన్ని వార్మప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి..’అని తెలిపాడు. 


బీజింగ్ యూనివర్సిటీలో  జువాలజీ విభాగంలో  మాస్టర్స్ చేస్తున్న  జున్ యు..  త్వరలో భారత పురుషుల జట్టు  ఆడబోయే మ్యాచ్‌లను వీక్షించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.