IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తద్వారా సిరీస్‌ను కూడా టీమిండియా 2-0తో గెలుచుకుంది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో వన్డే సెప్టెంబర్ 27వ తేదీన రాజ్‌కోట్‌లో జరగనుంది.


రాజ్‌కోట్ వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా కంగారూలను క్లీన్‌‌స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయంపై కన్నేసింది.


రాజ్‌కోట్ వన్డే వర్షానికి బలి కానుందా?
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా బుధవారం జరిగే మూడో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వాస్తవానికి బుధవారం రాజ్‌కోట్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. చినుకులు కూడా పడవచ్చు. మ్యాచ్ జరిగే రోజు రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసే అవకాశం మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది.


స్పోర్ట్స్-18లో భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్‌ను భారత అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. ఇది కాకుండా జియో సినిమాలో మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఈ విధంగా క్రికెట్ అభిమానులు స్పోర్ట్స్ 18, జియో సినిమాలలో ప్రత్యక్షంగా వీక్షించగలరు.


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో సాధించింది. ఆదివారం నాడు ఇండోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 99 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. 


భారత్ తరఫున ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104: 97 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105: 90 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), షాన్ అబాట్ (54: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా తరఫున కామెరాన్ గ్రీన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కానీ తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నాడు.


అంతకు ముందు శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial