Women Cricket Team Wins Gold: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.  చైనాలోని హాంగ్జౌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో అదరగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని  ఆసియా క్రీడల్లో  స్వర్ణం గెలుచుకుంది.   ఏసియన్ గేమ్స్‌‌లో క్రికెట్  ఆడటం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమానార్హం. భారత్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్య ఛేదనలో లంక.. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 97 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్.. 19 పరుగుల తేడాతో గెలిచి  పసిడి సొంతం చేసుకుంది. 


హాంగ్జౌ లోని పింగ్‌వెంగ్ వేదికగా  సోమవారం జరిగిన ఫైనల్‌లో  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే  స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై ఆ లక్ష్యాన్ని చేధించడానికి లంకకు సాధ్యం కాలేదు. భారత స్పిన్నర్ టిటాస్ సాధు  లంకను కోలుకోలేని దెబ్బకొట్టింది.  వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి లంకను కోలుకోలేకుండా చేసింది. 


సాహో  సాధు..


పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో   హర్మన్‌ప్రీత్ తొలి ఓవర్‌నే  స్పిన్నర్ దీప్తి శర్మకు ఇచ్చింది. లంక సారథి చమీర ఆటపట్టు (12 బంతుల్లో 12, 1 ఫోర్, 1 సిక్స్) ఆ ఓవర్లో  సిక్సర్, ఫోర్ కొట్టడంతో 12 పరుగులొచ్చాయి. మూడో ఓవర్ వేసిన సాధు.. తొలి బంతికే సంజీవనిని  ఔట్ చేసింది. ఇదే ఓవర్లో  నాలుగో బంతికి  విష్మి గుణరత్నె (0) ను బౌల్డ్ చేసింది. తొలి ఓవరే డబుల్ మెయిడిన్. ఐదో ఓవర్‌లో సాధు.. కెప్టెన్ ఆటపట్టు పని పట్టింది. రెండో బంతికి  ఆమె.. దీప్తి శర్మ‌కు క్యాచ్ ఇచ్చింది.  ఈ ఓవర్‌లో  జెమీమా  క్యాచ్ మిస్ చేయకుంటే   నీలాక్షి డిసిల్వ వికెట్ కూడా దక్కేది. తొలి ఓవర్లో 12 పరుగులు చేసిన లంక.. ఐదు ఓవర్లలో 15-3గా ఉంది. 


భయపెట్టిన పెరెరా


సాధు జోరుతో  వేగం తగ్గిన  లంక స్కోరుబోర్డుకు హాసిని పెరెరా ఊపు తెచ్చింది.  పూజా వస్త్రకార్ వేసిన  ఆరో ఓవర్లో  ఆమె మూడు ఫోర్లు కొట్టింది. నీలాక్షి డిసిల్వా కూడా కుదరుకున్నట్టే అనిపించింది.  అమన్‌జోత్ కౌర్ వేసిన 9వ ఓవర్లో ఐదో బంతికి ఆమె సిక్సర్ బాదింది. గైక్వాడ్ వేసిన పదో ఓవర్లో పెరెరా.. 4,6 బాదింది. కానీ నాలుగో బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న  వస్త్రకార్ చేతికి చిక్కింది.  పది ఓవర్లకు లంక  నాలుగు వికెట్లు కోల్పోయి 50  పరుగులు చేయగలిగింది.  






ఆ తర్వాత  కూడా లంక బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. తొలి ఓవర్లో  12 రన్స్ ఇచ్చిన దీప్తి తర్వాత  మెరుగైంది. ఆమెకు తోడుగా దేవికా వైద్య, టిటాస్  సాధు కూడా ఇరువైపులా లంకను కట్టడి చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సాధించాల్సిన  నెట్ రన్ రేట్ పెరిగిపోయింది. 34 బంతులాడి 23 పరుగులు లంక క్యాంప్‌లో ఆశలు నింపిన నీలాక్షి డిసిల్వను వస్త్రకార్.. 17వ ఓవర్లో పెవిలియన్ చేర్చింది. ఆ ఓవర్లో తొలి బంతికే ఆమె బౌల్డ్ అయింది. దీప్తి వేసిన  18వ ఓవర్లో రణసింగె (26 బంతుల్లో 19, 2 ఫోర్లు) కూడా నిష్క్రమించడంతో లంక విజయంపై ఆశలు వదులుకుంది. ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరం అనగా దేవికా వేసిన 19వ ఓవర్లో  ఐదు పరుగులే రాగా  కవిష దిల్హరి వికెట్ కోల్పయింది. చివరి ఓవర్ వేసిన  గైక్వాడ్.. ఒక్క వికెట్ తీసి ఐదు పరుగులే ఇచ్చింది. లంక ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 97-8గా ముగిసింది.  దీంతో భారత్.. స్వర్ణ పతకాన్ని  కైవసం చేసుకుంది. 


భారత బౌలర్లలో సాధు మూడు వికెట్లు దక్కించుకోగా.. వస్త్రకార్, దీప్తి శర్మ, దేవికా వైద్యలు తలా ఓ వికెట్ తీశారు. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు దక్కించుకుంది.  సాధు.. నాలుగు ఓవర్లు వేసి  ఓ మెయిడిన్‌తో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చింది.