IND vs AUS: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడం లెఫ్ట్ హ్యాండర్లకు కత్తిమీద  సామే.  బంతి ఎటువైపు వస్తుందో అంచనా వేసేలోపే అది కాస్తా స్టంప్స్‌ను ఎగురగొడుతుంది.  రైట్ హ్యాండ్ బ్యాటర్లతో పోలిస్తే  ఎడమ చేతి వాటం బ్యాటర్లకు అశ్విన్  బౌలింగ్ సవాల్ విసురుతుంది.  ఇది గమనించిన  ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆదివారం ఇండోర్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో తన స్టాన్స్‌ను మార్చుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో తన సహజ శైలి (లెఫ్ట్ హ్యాండ్)ని మార్చుకుని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. 


అశ్విన్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతిని ఎదుర్కున్న వార్నర్..  రైట్ హ్యాండ్  బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి బంతి ఆఫ్ బ్రేక్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో మొదటి బంతిని  పాయింట్ దిశగా సింగిల్ తీశాడు.   మూడో బంతికి  స్వీప్ ద్వారా  బౌండరీకి తరలించాడు. నాలుగో బంతికి మరో సింగిల్ తీశాడు. 






వార్నర్ భాయ్ ఆతృత గమనించిన అశ్విన్   తర్వాత ఓవర్లో తక్కువ ఎత్తులో విసిరాడు. 15వ ఓవర్ తొలి బంతిని  క్యారమ్ బాల్‌గా సంధించాడు. అయితే  దానిని రివర్స్ స్వీప్ చేయబోయిన వార్నర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.   బంతిని తప్పుగా అంచనా వేసిన వార్నర్.. స్వీప్ చేయబోయే క్రమంలో బాల్ మిస్ అయినా అది  కాస్తా ఎడమకాలుకి తాకింది.  దీంతో అశ్విన్‌తో సహా వికెట్ కీపర్, భారత ఆటగాళ్లు  ఎల్బీ కోసం అప్పీల్ చేశారు.  అంపైర్ అవుట్ ఇవ్వగా వార్నర్ దానిని రివ్యూ కోరాడు. బంతి కాస్తా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్నట్టు రివ్యూలో తేలడంతో వార్నర్ నిరాశగా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్  రైట్ హ్యాండ్‌కు మారడం.. ఓ ఫోర్ కూడా కొట్టడం, తర్వాత అశ్విన్  చేతిలోనే  ఆసీస్ ఓపెనర్ ఔట్ అయిన దృశ్యాలు  ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతున్నాయి. 






ఇక నిన్నటి మ్యాచ్‌లో అశ్విన్.. తొలుత మార్నస్ లబూషేన్‌‌ను బౌల్డ్ చేశాడు. వార్నర్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మొత్తంగా  రెండో వన్డేలో ఏడు ఓవర్లే వేసి  41 పరుగులిచ్చిన అతడు.. మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలకపాత్ర  పోషించాడు.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత  50 ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105)లు సెంచరీలతో కదం తొక్కగా  కెప్టెన్ కెఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72)లు  మెరుపులు మెరిపించారు.  ఫలితంగా  భారత్ భారీ స్కోరు చేసింది. అనంతరం వర్షం  అంతరాయం కలిగించగా ఆసీస్ విజయలక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్దేశించగా ఆ జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగులకే కుప్పకూలింది.  అశ్విన్, జడేజాలు తలా మూడు వికెట్లు పడగొట్టారు. ప్రసిధ్ కృష్ట రెండు వికెట్లు తీయగా షమీ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.