IND vs AUS: వన్డే వరల్డ్ కప్ ముంచుకొస్తున్న వేళ  భారత జట్టును అత్యంత  ఆందోళనకు గురిచేసిన అంశాలు రెండు ఉండేవి. 15 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు  మిడిలార్డర్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌ల ఎంపిక విమర్శలకు తావిచ్చింది. అసలు వన్డేలలో  దారుణంగా విఫలమవుతున్న  సూర్యకుమార్ యాదవ్.. శస్త్రచికిత్స నుంచి కోలుకుని జట్టులోకి వచ్చినా అసలు పూర్తి ఫిట్‌నెస్ వచ్చిందా..?  ఫామ్ లోకి రాగలడా..? అనుకున్న శ్రేయస్‌లు ఆస్ట్రేలియా సిరీస్‌తో తమ ఎంపిక తప్పు కాదని నిరూపించారు. 


సూర్య  గ్రహణం వీడింది!


టీ20 క్రికెట్‌లో  సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి వేలెత్తి చూపడానికి ఒక్క లోపం కూడా ఉండదు. కానీ అదే సూర్య వన్డేలలో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. టీ2‌0‌లో ఆడే ఆటలో పావు వంతు కూడా వన్డేలలో ప్రదర్శించలేకపోయాడు.   వన్డే వరల్డ్ కప్‌నకు ఎంపికైన సూర్య.. ఇటీవల ఆసియా కప్‌‌లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆసీస్ సిరీస్ అతడికి జీవన్మరణ సమస్యగా మారిందని చెప్పకతప్పదు. సీనియర్లను పక్కనపెట్టడంతో  సూర్య‌కు ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం చిక్కింది. 2022 నుంచి మొన్నటి ఆసియా కప్ నాటికి 21 మ్యాచ్‌లు ఆడిన  సూర్య హయ్యస్ట్ స్కోరు 34 పరుగులు. దాదాపు ఏడాదిన్నరగా అర్థ సెంచరీ అన్నదే లేదు.  ఇక ఆస్ట్రేలియాతో  మార్చిలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో  సూర్య.. మూడు సార్లూ డకౌట్ అయ్యాడు.  వన్డేలలో వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్య ‘వన్ ఫార్మాట్ వండర్’గా మిగిలపోతాడా..? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  కానీ ఆస్ట్రేలియాతో తాజాగా జరుగుతున్న  వన్డే సిరీస్‌లో సూర్య ఆ విమర్శలకు తన బ్యాట్‌‌తోనే సమాధానం చెప్పాడు.  


ఆసీస్‌తో తొలి వన్డేలో భాగంగా సూర్య అర్థ సెంచరీ (50) సాధించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన పరుగుల కంటే  పార్మాట్‌కు తగ్గట్టుగా తన ఆటను మార్చుకున్న తీరు అబ్బరపరిచింది.  కెఎల్ రాహుల్‌తో కలిసి  సూర్య కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  వికెట్ కాపాడుకుంటూ  వికెట్ల మధ్య   పరిగెడుతూ ఆసీస్‌ను చికాకుపెట్టాడు. ఇక రెండో వన్డేలో అప్పటికే భారత్  మెరుగైన స్థానంలో ఉండటంతో  సూర్యకు తన సహజసిద్ధమైన ఆట  ఆడేందుకు వీలుచిక్కింది.  గత సిరీస్‌లో ఆసీస్‌తో మూడుసార్లు డకౌట్ అయిన సూర్య..  నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా  వరుసగా నాలుగు సిక్సర్లు బాది తానెంత ప్రమాదకారో చెప్పాడు.   ఆడింది 37 బంతులే అయినా ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్ల  సాయంతో 72 పరుగులు  చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 


శ్రేయస్.. యెస్ 


ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌ను వేధించిన మరో కీలక సమస్య నెంబర్ 4.  ఈ స్థానంలో శ్రేయస్‌కు మంచి రికార్డు ఉంది.   వన్డే వరల్డ్ కప్‌లో అతడి ఎంపికపైనా అనుమానాలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే  అయ్యర్ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ ఆడగానే  గాయం తిరగబెట్టడంతో మిగతా మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 8 బంతులాడి 3 పరుగులే చేశాడు.  దీంతో అయ్యర్ కథ ముగిసినట్టేనన్న విమర్శలు వెల్లువెత్తాయి.   రెండో వన్డేలో రాణించకుంటే అయ్యర్‌‌కు వన్డే వరల్డ్ కప్‌లో ప్లేస్ కూడా అనుమానమే అయ్యేది. కానీ కీలక సమయంలో అయ్యర్ జూలు విదిల్చాడు. ఇండోర్ వన్డేలో  మూడో స్థానంలో వచ్చి 90 బంతుల్లోనే 11 బౌండరీలు, 3 సిక్సర్లతో  105 పరుగులు చేసి కొంచెం లేట్ అయినా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 


సూర్య, అయ్యర్‌లు వన్డే ప్రపంచకప్‌కు ముందు  ఫామ్ సంతరించుకోవడం భారత్‌కు  మేలుచేసేదే.  ఈ ఇద్దరూ మిడిలార్డర్‌లో చాలా కీలకం.  జట్టు కాంబినేషన్ దృష్ట్యా  వీరిలో ఎవరు తుది జట్టులో ఉంటారు..? అన్నది  ప్రస్తుతానికి సస్పెన్సే అయినా  ఈ ఇరువురూ ఫామ్‌లోకి రావడం భారత్‌కు అదనపు బలమే..