Axar Patel Ruled Out: టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్రపంచకప్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అక్షర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో రెండు వన్డేలకు దూరమైన అతడు మూడో వన్డే వరకైనా అందుబాటులో ఉంటాడని టీమిండియా భావించినా అతడు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. రాజ్‌కోట్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే మూడో వన్డే నుంచి అక్షర్ తప్పుకున్నాడు.
వరల్డ్ కప్ వరకు కోలుకుంటాడా..?
ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ఎడమ కాలు తొడ కండరాలలో అతడికి గాయం అయినట్టు సమాచారం. గాయమైన వెంటనే ఎన్‌సీఏకు వచ్చిన అక్షర్‌ను ప్రపంచకప్ ముందు ఆడించి గాయాన్ని పెద్దది చేసేకంటే రెస్ట్ ఇచ్చిందే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్న సెలక్టర్లు.. రెండు వన్డేలకూ అతడిని పక్కనబెట్టారు. కానీ ఇప్పుడు మూడో వన్డేకూ అతడు దూరం కావడంతో అసలు అక్షర్ ప్రపంచకప్ నాటివరకైనా కోలుకుంటాడా..? అన్న అనుమానం కలుగుతోంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా పది రోజుల సమయమే ఉంది. అంతకంటే ముందే భారత్ ఈనెల 30న ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ వరకు అయినా అక్షర్ కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులో ఉంటాడు. లేకుంటే అక్షర్ కలలు కల్లలైనట్టే..
అశ్విన్‌కు అవకాశం..
అక్షర్ గాయంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌కు ప్రపంచకప్ ముందు అంతా అనుకూలంగానే జరుగుతోంది. అక్షర్ గాయం అశ్విన్‌కు వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. రాజ్‌కోట్ వన్డేకూ అక్షర్ దూరమైన నేపథ్యంలో ఇదివరకే రెండు వన్డేలలోనూ నిరూపించుకున్న అశ్విన్‌కు వరల్డ్ కప్‌లో గేట్ పాస్ దక్కినట్టే.. అక్షర్ దూరమైన నేపథ్యంలో రాజ్‌కోట్‌లో కూడా అశ్విన్ బరిలో ఉంటాడు. అక్షర్ కోలుకోని నేపథ్యంలో తమిళ తంబీకి మరో వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
గిల్ - శార్దూల్ దూరం..
ఆసీస్‌తో ఇదివరకే సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియా.. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గిల్, ఠాకూర్‌లకు విశ్రాంతినిచ్చింది. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా రాజ్‌కోట్‌కు వెళ్లగా గిల్, ఠాకూర్ మాత్రం వారితో వెళ్లలేదు. ఈ ఇద్దరూ గువహతిలో భారత జట్టుతో కలుస్తారు.