ODI World Cup 2023: భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యాడా..? నిన్నట్నుంచి సోషల్ మీడియాలో  దీనిపై చర్చ జోరుగా సాగుతోంది.  ఓ ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్ నోటిలో గుడ్డలు కుక్కి  ఓ ఇంటిలోనికి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.  ఇది చూసిన అభిమానులు  ఆందోళనకు గురయ్యారు. టీమిండియా మాజీ ఓపెనర్, ఈశాన్య ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ కూడా  ఈ వీడియోను షేర్ చేస్తూ  కపిల్ దేవ్  క్షేమంగా ఉండాలని ట్వీట్ చేయడంతో అభిమానుల  ఆందోళన మరింత ఎక్కువైంది. 


అయితే కపిల్ దేవ్ నిజంగానే కిడ్నాప్ అయ్యాడా..? వివాదాలకు దూరంగా ఉండే  కపిల్‌ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని క్రికెట్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు.   ఇందులో ఏదో మతలబు ఉందని కామెంట్ చేసిన నెటిజన్లు కూడా ఉన్నారు. వారి అనుమానమే నిజమైంది.  కపిల్ దేవ్‌ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఇదంతా ఓ యాడ్ కోసం  చేసిన పని. యాడ్‌లో భాగంగా షూట్ చేసిన కొంత భాగాన్ని   కట్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో   ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెట్టే విధంగా ఇంత గొప్ప ఆలోచన వచ్చింది ఎవరికి అనుకుంటున్నారా..?  ఇంకెవరికి  డిస్నీ హాట్ స్టార్‌కే..  ప్రపంచకప్  హక్కులు వాళ్ల దగ్గరే ఉన్నాయి మరి.. 






అసలు విషయానికొస్తే..  ఐసీసీ  క్రికెట్ వరల్డ్ కప్ హక్కులు  స్టార్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేండ్లుగా భారత క్రికెట్ జట్టుకు    ప్రసారదారుగా ఉన్న స్టార్ ఇటీవలే  రిలయన్స్‌తో పోటీపడలేక  ఆ అవకాశాన్ని కోల్పోయింది. కానీ ఐసీసీ ఈవెంట్లు ఇంకా స్టార్ వద్దే ఉన్నాయి.  వరల్డ్ కప్‌ను ఈసారి ఉచితంగా అందించేందుకు  హాట్ స్టార్  ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఈ యాడ్‌ను రూపొందించారు.  


కపిల్‌ను కిడ్నాప్ చేశాక పోలీసులు వచ్చి గ్రామస్తులను ‘కెప్టెన్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు..?’ అని అడుగుతారు. అప్పుడు గ్రామపెద్ద.. ‘మాకు వన్డే వరల్డ్ కప్ జరిగినంతకాలం ఊళ్లో  విద్యుత్  సమస్య ఉండకూదని గ్యారెంటీ కావాలి’ అని డిమాండ్ చేస్తాడు. అప్పుడు పోలీస్ అధికారి ‘అరె, దానికేముంది.   కరెంట్ సమస్య ఏం ఉండదు. ఈసారి వన్డే వరల్డ్ కప్‌ను డిస్నీ హాట్ స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చు..’అని చెప్పగానే ఓ యువకుడు.. ‘ఆ, ఇలాగే చెబుతారు. ఐదు నిమిషాలు మాత్రమే ఫ్రీ ఇస్తారు’ అని  ప్రశ్నిస్తాడు. దానికి పోలీస్.. ‘లేదు. లేదు. మ్యాచ్ మొత్తం ఫ్రీ’  అనగానే మరో యువకుడు ‘మరి  మొబైల్ డేటాకు డబ్బులు ఎవరిస్తారు..? మీ అయ్య ఇస్తాడా..?’ అని అడుగుతాడు.  అప్పుడు అదే అధికారి.. ‘డేటా సేవర్ మోడ్  కూడా ఉంది’ అని  చెప్పడంతో గ్రామపెద్ద  కపిల్‌కు కట్టిన కట్లు విప్పమని అంటాడు.  వినూత్నంగా ఉన్న ఈ యాడ్ ఇప్పుడు  నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.