భారత వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా  కప్పు కలను సాకారం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌...నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత్‌ బౌలర్లు చుట్టేశారు. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్‌ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్‌.. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు కూడా దూసుకెళ్లింది.

 

రోహిత్‌  కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌  బట్లర్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ గెలిచిన అయిదు మ్యాచుల్లోనూ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా... తొలిసారి బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌ను మెయిడెన్‌ ఆడాడు. కానీ తర్వాత గిల్‌, రోహిత్‌ మంచి టచ్‌లో కనిపించాడు. గిల్‌ బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. కానీ 26 పరుగుల వద్ద శుభ్‌మన్‌గిల్‌ను  బౌల్డ్‌ చేసిన వోక్స్‌ ఇంగ్లండ్‌కు తొలి వికెట్‌ను అందించాడు. 13 బంతుల్లో ఒక బౌండరీతో 9 పరుగులు చేసిన గిల్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత స్కోరు బోర్డుపై మరో పరుగు చేరిందో లేదో ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ  డకౌట్ అయ్యాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 16 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయస్స్ అయ్యర్‌ కూడా అవుటవ్వడంతో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో కె. ఎల్‌. రాహుల్‌ అవుటవ్వడం టీమిండియాను  దెబ్బ తీసింది. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన రాహుల్‌ విల్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి  అవుటయ్యాడు. దీంతో రాహుల్‌- రోహిత్ మధ్య నమోదైన 91 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌ అవుటైనా హిట్‌ మ్యాన్‌ పోరాటాన్ని కొనసాగించాడు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్‌ రషీద్‌ అవుట్‌ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్‌ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

 

సూర్య సమయోచితంగా...

రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. పిచ్‌ను అర్థం చేసుకుని తనశైలికి విరుద్ధంగా స్కై బ్యాటింగ్‌ చేశాడు. బ్రిటీష్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ టీమిండియా స్కోరును 200 దాటించాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగుల వద్ద సూర్య అవుటయ్యాడు. కానీ చివర్లో బుమ్రా.. కుల్‌దీప్‌ యాదవ్‌ పర్వాలేదనిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ మూడు, క్రిస్‌ వోక్స్‌ 2, అదిల్‌ రషీద్ 2 వికెట్లు తీశారు.

 

వణికించిన భారత బౌలర్లు

అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లను టీమిండియా బౌలర్లు వణికించారు. వరుసగా వికెట్లు తీసి బ్రిటీష్‌ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోకుండా చేశారు. నాలుగో ఓవర్లో  డేవిడ్‌ మలన్‌, జో రూట్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చిన బుమ్రా ఇంగ్లండ్‌ పతనాన్ని సాధించాడు. ఇక ఏ దశలోనూ బ్రిటీష్‌ జట్టు కోలుకోలేదు. షమీ రంగంలోకి దిగిన తర్వాత ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి. బెన్‌ స్టోక్స్‌ను అద్భుత బంతితో బౌల్డ్‌ చేసిన షమీ... తర్వాతి ఓవర్‌ తొలి బంతికే బెయిర్‌ స్టోను కూడా అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ ముందు నిలిచాడు. కానీ షమీ హ్యాట్రిక్‌ను మొయిన్ అలీ అడ్డుకున్నాడు. మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 22 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా 6.5 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌ ఎనిమిది ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

 

బ్రిటీష్‌ బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌ ఒక్కడే 27 పరుగులు చేశాడు. మిగిలిన ఏ బ్యాటర్‌ కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేదు. ఏడుగురు బ్యాటర్లు కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.