టీమిండియా సారధి రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్‌ వందో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న హిట్‌మ్యాన్‌ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇది వందో మ్యాచ్ కాగా.. ఈ మ్యాచ్‌లోనే  కెప్టెన్‌గా 4 వేల పరుగుల మార్కును హిట్‌మ్యాన్ అందుకున్నాడు. అలాగే 2023లో వన్డేల్లో వేయి పరుగులు పూర్తిచేసుకున్న తొలి కెప్టెన్‌గానూ హిట్‌మ్యాన్ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లో హిట్ మ్యాన్ 18 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్, విరాట్, ద్రావిడ్, గంగూలీ ఈ ఘనత సాధించారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 48వ పరుగులు పూర్తి చేసిన తర్వాత రోహిత్ శర్మ ఈ మైలురాయిని సాధించాడు. రోహిత్ శర్మ 477 ఇన్నింగ్స్‌ల్లో 18 వేల పరుగులు చేసిన ఘనత సాధించాడు. 



 రోహిత్‌ శర్మ వన్డే ఫార్మాట్‌లో 10470 పరుగులు చేశాడు.  టెస్టుల్లో 3,677, టీ 20ల్లో 3853 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో హిట్‌ మ్యాన్‌ మొత్తం  45 సెంచరీలు సాధించాడు. 98 సార్లు అర్ధ శతకాలు చేశాడు. రోహిత్ శర్మ 257 వన్డేల్లో 249 ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్‌ తన పేరిట అరుదైన రికార్డులను నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ శర్మ 10 సెంచరీలు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. టీ20 ఫార్మాట్‌లో హిట్‌ మ్యాన్  4 సార్లు సెంచరీ మార్క్‌ను దాటగా.. 29అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 6 మ్యాచ్‌ల్లో 75.40 సగటుతో 377 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. డికాక్‌ 6 మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 6 మ్యాచ్‌ల్లో 68.83 సగటుతో 413 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర 6 మ్యాచ్‌ల్లో 81.20 సగటుతో 406 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. 



 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రోహిత్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రాహుల్‌తో కలిసి రోహిత్ మధ్య 91 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్‌ రషీద్‌ అవుట్‌ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్‌ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
 ప్రపంచకప్‌లో భాగంగా లక్నో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ముందు.. టీమిండియా 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత జట్టు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై.. పరుగులు రావడమే కష్టమైన వేళ భారత బ్యాటర్లను... ఇంగ్లండ్‌ బౌలర్లు ఇబ్బంది పెట్టగలిగారు. బంతి బ్యాట్‌పైకి రాకపోవడం, అదనపు బౌన్స్‌ లభించడాన్ని బ్రిటీష్‌ బౌలర్లు సమర్థంగా ఉపయోగించుకున్నారు. వరుసగా వికెట్లు తీసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగారు. కానీ రోహిత్‌ శర్మ, సూర్య, రాహుల్‌ పోరాటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.