ODI World Cup 2023:
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. డ్రాఫ్ట్ షెడ్యూలును బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. సభ్యదేశాలు ఆమోదించగానే టోర్నీ తేదీలు, వేదికలు, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు మరో వారం రోజులు పడుతుందని సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ భూమ్మీద అతిపెద్ద స్టేడియం మోతేరాలోనే జరగనుంది. అక్టోబర్ 15న లక్షా పదివేల మంది ఈ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.
భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ను చివరిసారి విజేత, రన్నరప్ ఆరంభించనున్నాయి. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఇక టీమ్‌ఇండియా మూడు రోజుల తర్వాత చెపాక్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఎప్పట్లాగే ఈసారీ కొన్ని శత్రుదేశాల మధ్య మ్యాచులు ఆకట్టుకోనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. నవంబర్ 15, 16న నిర్వహించే సెమీ ఫైనళ్ల వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
డ్రాఫ్ట్ షెడ్యూలు ప్రకారం టీమ్ఇండియా తొమ్మిది వేదికల్లో లీగ్ మ్యాచులు ఆడనుంది. అక్టోబర్ 8న చెపాక్‌లో ఆస్ట్రేలియా, 11న దిల్లీలో అఫ్గాన్, 15న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్, 19న పుణెలో బంగ్లాదేశ్, 22న ధర్మశాలలో న్యూజిలాండ్, 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్, నవంబర్ 2న ముంబయిలో క్వాలిఫయర్ జట్టు, 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా, 11న బెంగళూరులో రెండో క్వాలిఫయర్ జట్టుతో టీమ్‌ఇండియా తలపడుతుంది.
దాయాది పాకిస్థాన్ లీగ్ మ్యాచుల్ని ఐదు వేదికల్లో తలపడనుంది. అహ్మదాబాద్‌లో టీమ్‌ఇండియాతో పోరును పక్కనపెడితే అక్టోబర్ 6, 12న హైదరాబాద్‌లో రెండు క్వాలిఫయర్ జట్లు, అక్టోబర్ 20, 23 తేదీల్లో బెంగళూరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, 27, 31న కోల్‌కతాలో చెన్న, బంగ్లాదేశ్, నవంబర్ 5న బెంగళూరులో న్యూజిలాండ్, 12న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 29న ధర్మశాలలో ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, నవంబర్ 4న ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, నవంబర్ 1న న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా వంటి పెద్ద మ్యాచులు జరుగుతాయి.
సాధారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ మ్యాచులను ఏడాది ముందే ప్రకటిస్తారు. ఈసారి మాత్రమే కాస్త ఆలస్యమైంది. నాలుగు నెలల ముందు షెడ్యూలు ఇస్తున్నారు. మామూలుగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రోజునే షెడ్యూలు విడుదల చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా మే27న అన్నారు. అయితే మరో వారం రోజులూ ఆలస్యమే అవుతోంది.