భారత్‌-పాక్‌ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌ మైదానంలో క్రికెట్‌ అభిమానులు చేసిన జై శ్రీరాం నినాదాలపై వివాదం కొనసాగుతోంది. పాక్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు జై శ్రీరాం నినాదాలు వినపడ్డాయి. దీనిపై సోషల్‌ మీడియాలో భారత క్రికెట్‌ అభిమానులు ఇస్లామోఫోభియాతో బాధపడుతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు కూడా దీటుగా బదులిస్తున్నారు. 


 ప్రపంచకప్‌లో భాగంగా డిఫెండిగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను అఫ్ఘానిస్థాన్‌ మట్టికరిపిస్తున్నప్పుడు అఫ్గాన్‌ జట్టుకు భారత అభిమానులు ఢిల్లీ మైదానంలో మద్దతుగా నిలిచారని భారత క్రికెట్‌ ప్రేమికులు గుర్తు చేస్తు‌న్నారు. బ్రిటీష్‌ బ్యాటర్ల వికెట్లు పడ్డప్పుడల్లా నినాదాలతో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం మార్మోగిపోయిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్‌ జట్టులో లాగానే అఫ్ఘానిస్థాన్‌ జట్టులోనూ ముస్లింలు ఉన్నా కూడా భారత అభిమానులు సంపూర్ణ మద్దతు ఇచ్చారని పోస్ట్‌లు పెడుతున్నారు. భారత అభిమానులు ఇస్లామోఫోభియాతో బాధపడితే మరి అఫ్గాన్‌ జట్టుకు అండగా ఎందుకు నిలుస్తారని నిలదీస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ ఆటగాళ్లలాగా అఫ్గాన్‌ క్రికెటర్లు తమ మత ఆచారాలను బహిరంగంగా ప్రదర్శించేందుకు ఇష్టపడరని అందుకే అఫ్గాన్‌ జట్టుకు భారత క్రికెట్‌ అభిమానులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 


ఆరంభ పోరులో పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో శ్రీలంకతో తలపడినప్పుడు పాక్‌ జట్టుకు హైదరాబాదీ ప్రేక్షకులు మద్దతు పలికిన విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి పాక్‌ జట్టు అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు వారికి ఘన స్వాగతం లభించిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఇదీ భారత అభిమానం అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా భారత అభిమానులు ఆదిపురుష్‌ చిత్రంలో జై శ్రీరామ్‌ పాట వచ్చినప్పుడు గొంతు కలిపారని... అలా ఆ ఒక్కపాటకే కాదని మ్యాచ్‌ సందర్భంగా ప్లే చేసిన ప్రతీ పాటకు అభిమానులు గొంతు కలిపి సందడి చేశారని వీడియోలను సాక్ష్యంగా పోస్ట్‌ చేస్తూ విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు. 


మహ్మద్ రిజ్వాన్ పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో ప్రేక్షకుల నుంచి జై శ్రీరామ్ నినాదాలు వినిపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రిజ్వాన్ మ్యాచ్‌ సందర్భంగా కూడా నమాజ్‌ చేసి తన మత విశ్వాసాలను ప్రదర్శించిన వీడియోను పోస్ట్‌ చేసి ఇదేంటని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్‌ నమాజ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఇది ఆటలోకి మతాన్ని ప్రవేశపెట్టడం కాదా అని ఆ ఫోటో కింద కొందరు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. 


కనేరియా మాటలు గుర్తు చేస్తున్న నెటిజన్లు పాక్‌ క్రికెట్‌ జట్టులో వివక్ష ఎదుర్కొన్నానని పాక్‌ మాజీ హిందూ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా చేసిన కామెంట్స్‌ను స్క్రీన్‌ షాట్లు తీసి పోస్ట్‌ చేసి దీనికి సమాధానం చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. పాకిస్తాన్ జట్టులో హిందువుగా తాను ఎంత కష్టపడ్డని కనేరియా వెల్లడించిన వీడియోను కూడా పోస్ట్‌ చేస్తున్నారు. పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు భారత్ ఇంతకంటే ఘోరమైన ఎన్నో ఘటనలను చవిచూసిందని అప్పటి మాజీ క్రికెటర్లు గుర్తు చేసుకున్న వీడియోలను కూడా పోస్ట్‌ చేస్తున్నారు. 1989లో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌పై పాకిస్థానీ అభిమాని దాడి చేసిన విషయాన్ని భారత క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ పాకిస్థాన్‌లో జాత్యహంకార దూషణలను గురవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌ అర్ధ శతకం చేసినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టిన వీడియో పోస్ట్‌ చేస్తూ ఇది భారత క్రికెట్‌ అభిమానుల క్రీడా స్ఫూర్తి అని నెటిజన్లు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.