వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా మొదటి విజయం అందుకుంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 35.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. నాలుగు వికెట్లు తీసుకున్న ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (58: 59 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), మిషెల్ మార్ష్ (52: 51 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడి మంచి రన్‌రేట్ తీసుకురావడంలో సాయపడ్డారు. అంతకు ముందు శ్రీలంక తరఫున ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లిస్, మార్ష్ అర్థ సెంచరీలు
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభం అయింది. విజయం సాధించడంతో పాటు మంచి నెట్ రన్ రేట్ సాధించడంపై కూడా ఆస్ట్రేలియా ఓపెనర్లు దృష్టి పెట్టారు. దీంతో మూడు ఓవర్లలోనే స్కోరుబోర్డుపై 24 పరుగులు చేరాయి. సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11: 6 బంతుల్లో, ఒక సిక్సర్), కీలకమైన స్టీవ్ స్మిత్‌లను (0: 5 బంతుల్లో) దిల్షాన్ మధుశంక నాలుగో ఓవర్లో అవుట్ చేసి శ్రీలంక శిబిరంలో ఆనందం నింపాడు.
అక్కడ నుంచి మార్నస్ లబుషేన్ (40: 60 బంతుల్లో, రెండు ఫోర్లు), మరో ఓపెనర్ మిషెల్ మార్ష్ (52: 51 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరు మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ దశలో లేని పరుగుకు ప్రయత్నించి మిషెల్ మార్ష్ అవుటయ్యాడు. జోష్ ఇంగ్లిస్‌తో (58: 59 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి లబుషేన్ మరో భాగస్వామ్యం నిర్మించాడు. వీరు నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించి విజయానికి చేరువ చేశారు. లక్ష్యానికి కొద్ది దూరంలో జోష్ ఇంగ్లిస్ అవుట్ అయినా గ్లెన్ మ్యాక్స్‌వెల్(31 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మ్యాచ్‌ను ముగించారు.
84 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు
అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) శ్రీలంక ఇన్నింగ్స్‌కు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఒకానొక దశలో 21.3 ఓవర్లలో 125-0 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన శ్రీలంక ఊహించని రీతిలో 84 పరుగుల వ్యవధిలో మొత్తం 10 వికెట్లనూ కోల్పోయింది. 43.3 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలిపోయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial