ICC Cricket World Cup: 2023 వరల్డ్ కప్‌లో మరో కొలాప్స్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పరుగులకు 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 21.3 ఓవర్లలో 125-0 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన శ్రీలంక ఊహించని రీతిలో 84 పరుగుల వ్యవధిలో మొత్తం 10 వికెట్లూ కోల్పోయింది. ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) తర్వాత చరిత్ అసలంక (25: 39 బంతుల్లో, ఒక సిక్సర్) మినహా మరెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టారు.


ఒక్కసారిగా కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) శ్రీలంక ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించారు. ఆసీస్ బౌలర్లకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడారు. దీంతో మొదటి 10 ఓవర్లలో శ్రీలంక వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.


అనంతరం కాస్త వేగం పెంచారు. దీంతో 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో 63 పరుగులు వచ్చాయి. అయితే ఇన్నింగ్స్ 22వ ఓవర్లో క్రీజులో కుదురుకున్న పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) వికెట్ తీసి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు మొదటి వికెట్ అందించారు. అనంతరం కుశాల్ మెండిస్‌తో (9: 13 బంతుల్లో) కలిసి కుశాల్ పెరీరా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ పెరీరాను ప్యాట్ కమిన్సే క్లీన్ బౌల్డ్ చేశాడు. అక్కడ నుంచి శ్రీలంక పతనం ప్రారంభం అయింది.


ప్రతి రెండు, మూడు ఓవర్లకు ఒక వికెట్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు పడగొడుతూనే ఉన్నారు. మధ్యలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. అప్పటికి శ్రీలంక 32.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. కానీ తిరిగి ప్రారంభం అయ్యాక కూడా శ్రీలంక పరిస్థితి మెరుగుపడలేదు. చరిత్ అసలంక (25: 39 బంతుల్లో, ఒక సిక్సర్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఒక వికెట్ దక్కింది.


ఆస్ట్రేలియా తుది జట్టు
మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్


శ్రీలంక తుది జట్టు
పతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial