ఈ ప్రపంచకప్‌లో రాణిస్తున్న పాకిస్థాన్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శకతంతో రిజ్వాన్‌ పాక్‌కు విజయాన్ని అందించాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో  పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు. మైదానంలోనే రిజ్వాన్‌ నమాజ్‌  చేయడంపై న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఆట స్ఫూర్తికి విరుద్ధమని వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


భారత ప్రేక్షకుల ముందు నమాజ్‌ చేసి తాను ముస్లిం అని చూపించడమేనని, అది క్రీడా స్ఫూర్తిని ప్రభావితం చేస్తుందని జిందాల్ ఆరోపించారు. మైదానంలో ప్రార్థనలు చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనను గాజాకు అంకితం చేయడం మతపరమైన, రాజకీయ భావజాలం పట్ల అతని బలమైన మొగ్గును మరింత నొక్కి చెబుతుందని జిందాల్ తన ఫిర్యాదులో తెలిపాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ సమయంలో రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశాడు. వినీత్‌ జిందాల్‌ చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకూ ఐసీసీ స్పందించలేదు.


మైదానంలో నమాజ్‌ చేసినందుకు రిజ్వాన్‌ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ప్రశంసించాడు. కూడా హిందూ ప్రజల ముందు నిలబడి నమాజ్ చేసినందుకు రిజ్వాన్‌ను యూనిస్‌ పొగిడాడు. అంతేనా ఇది ప్రత్యేకమైనది అని కూడా కామెంట్‌ చేశాడు. శ్రీలంకపై తన జట్టు విజయాన్ని గాజాలోని సోదరులు, సోదరీమణులకు అంకితం చేస్తున్నట్లు కూడా రిజ్వాన్‌ ప్రకటించాడు. గాజాకు మద్దతుగా ట్వీట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసినా ఐసీసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిధిలోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. 


శ్రీలంకపై విజయాన్ని గాజాకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన రిజ్వాన్‌కు ఇజ్రాయెల్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది.  మా భారతీయ మిత్రులు ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలుపుతుండటం మమ్మల్ని ఎంతగానో కదిలించింది. భారత్‌ – పాకిస్తాన్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఇజ్రాయెల్‌ ట్వీట్‌ చేసింది.  భారత్‌ గెలుపుతో పాక్‌ తమ విజయాన్ని హమాస్‌ ఉగ్రవాదులకు అంకితం చేసే అవకాశం లేకుండా పోయిందని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో రిజ్వాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా నమాజ్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


 అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను చిత్తు ఓడించింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్‌ విలవిల్లాడింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌ విసిరే బంతులను ఎదుర్కోలేక జట్టులోని ఆరుగురు బ్యాటర్‌లు రెండంకెల స్కోర్‌ కూడా చేయకుండా పెవిలియన్‌ బాటపట్టారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండానే పాక్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. తరువాత బ్యాటింగ్‌లోనూ భారత్‌ చెలరేగిపోయింది. దీంతో వన్డే ప్రపంచకప్‌ 2023లో విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (86) మరోసారి చెలరేగిపోవడంతో పాకిస్థాన్‌ నిర్దేశించిన 192 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది.