Shardul Thakur: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేచిచూస్తున్న  ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌‌కు మరో రెండు నెలల్లో తెరలేవనుంది.   ఈ మేరకు ప్రపంచకప్ ఆడబోయే పది జట్లూ తమ జట్టు కూర్పు,  అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు రచిస్తున్నాయి. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగానే  భారత్ కూడా వెస్టిండీస్‌‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కొన్ని ప్రయోగాలు చేసింది.  రెగ్యులర్ పేసర్లు షమీ, సిరాజ్ లేకపోయినా శార్దూల్ ఠాకూర్‌ ఆ బాధ్యతలు మోశాడు.  ఈ సిరీస్‌లో భారత్ తరఫున అతడే ప్రధాన పేసర్ అయ్యాడు.  మరి శార్దూల్ వన్డే వరల్డ్ కప్‌లో ఎంపికవుతాడా..?  ఆ దిశగా అతడికి విండీస్ టూర్ ఏ మేరకు ఉపయోగపడింది..? 


సిరాజ్ గైర్హాజరీలో  పేస్ బాధ్యతలు మోస్తున్న శార్దూల్.. ఈ సిరీస్‌లో 8 వికెట్లు తీశాడు.  నిన్న ముగిసిన మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.  మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ.. ‘వాళ్లు (టీమ్ మేనేజ్‌మెంట్) ఒకవేళ నన్ను  ఎంపిక చేయకపోయినా నేనేం బాధపడను. అది వాళ్లకు సంబంధించిన విషయం. అందులో నేనేమీ చేయలేను...


జట్టులో నా స్థానాన్ని పదిలం చేసుకునేందుకో, వేరే వాళ్ల ప్లేస్‌లో  ఆడుతున్నానని అనుకునే రకం కాదు నేను.  మ్యాచ్‌లో పరిస్థితులను బట్టి నావల్ల టీమ్‌‌కు  ఏం అవసరం ఉంది..? నేనేం చేయగలను..? అన్నదానిని మైండ్‌లో ఉంచుకుంటా.  ఇందులో నా వ్యక్తిగత లాభం కోసం ఏమీ చేయను.  నేను చాలాకాలంగా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నా. జట్టులో నాకు చోటు ఉంటుందా..? లేదా..? అన్నది నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం నా ప్రభావం చూపెట్టేందుకు తపిస్తుంటా..’ అని  చెప్పుకొచ్చాడు. 


బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలిగే సత్తా ఉన్న శార్దూల్.. ఆల్ రౌండర్‌గా  జట్టు కూర్పులో తాను చాలా కీలకమని చెప్పకనే చెప్పాడు. ‘ఒక ఆల్ రౌండర్‌గా నేను లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు  వస్తా.  టీమ్‌లో నా రోల్ చాలా కీలకం. భారీ లక్ష్యాలను ఛేదించాల్సి వచ్చినప్పుడు,  ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచే క్రమంలో  వికెట్లు కోల్పోవడం కామనే. కానీ 8, 9వ స్థానాలలో వచ్చే  క్రికెటర్ కూడా  ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ ’ అని  తెలిపాడు. 


 






వన్డే వరల్డ్ ‌కప్‌లో తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతున్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు శార్దూల్ ప్రదర్శన మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టేదే.  బుమ్రా రీఎంట్రీ తర్వాత అతడు ఏ మేరకు ఫిట్‌నెస్ సాధించగలడు..? ఎలా ఆడగలడు..? అన్నది తేలాల్సి ఉంది. ఇక సిరాజ్ అయితే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అతడిని జట్టు నుంచి తప్పిస్తే అది తెలివితక్కువతనమే. కానీ వెటరన్ పేసర్ మహ్మద్ షమీని ఆడిస్తారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లదలుచుకుని.. షమీ, బుమ్రాలలో ఏ ఒక్కరు ఫిట్‌గా లేకపోయినా శార్దూల్ తప్పక టీమ్‌లో ఉంటాడు. బౌలింగ్‌‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడం అతడికి దొరికిన  గొప్ప అవకాశం. కానీ ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాతో వస్తే మాత్రం  శార్దూల్‌కు తిప్పలు తప్పవు. ఏదైనా సెప్టెంబర్ 5 వరకు తేటతెల్లం కానుంది. వచ్చే నెల 5 నాటికి అన్ని జట్లూ తమ సభ్యుల జాబితాను ఐసీసీకి పంపాల్సి ఉంది. 



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial