IND Vs WI, 3rd ODI: వెస్టిండీస్‌తో నిన్న రాత్రి ముగిసిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టుపై టీమిండియా 200 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్, సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతగా ప్రాధాన్యం లేని ఈ సిరీస్‌లో భారతజట్టు పలు ప్రయోగాలు చేసింది. టీమిండియా సీనియర్ వెటరన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లను పక్కనబెట్టి ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. యువ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, చాలాకాలంగా బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వంటివారికి అవకాశాలిచ్చింది. బౌలింగ్ విభాగంలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్‌లను పరీక్షించింది. మరి వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు కూర్పు విషయంలో సమాధానాలు దొరికాయా..? ప్రయోగాలు ఫలించాయా..?
ప్రపంచ కప్ ఆశావహులకు అవకాశాలను అందించాలని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. మూడో వన్డేలో కూడా రోహిత్, కోహ్లీ, చాహల్‌లకు రెస్ట్ ఇచ్చారు. రెండో వన్డేలో ఓడినప్పటికీ మూడో వన్డేలో ఫలితం భారత్‌కు అనుకూలంగానే వచ్చినా ఇప్పటికీ టీమిండియాను కొన్ని లోపాలు వేధిస్తూనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో అవి స్పష్టంగా కనిపించాయి.
ఆ నలుగురు ఇలా..
స్వదేశంలో భీకర ఫామ్‌లో కనిపించిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో, వెస్టిండీస్‌తో టెస్టులు, రెండు వన్డేలలోనూ విఫలమయ్యాడు. చివరి వన్డేలో ఎట్టకేలకు హాఫ్ సెంచరీతో రాణించాడు. గిల్ ఆట చూస్తే భారత్‌లో తప్ప విదేశాల్లో డౌటే..? అన్న చందంగా సాగుతోంది. కానీ ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చాలాకాలంగా జట్టులో ఉంటున్నా తుది జట్టులో అవకాశాలు లేక తంటాలు పడుతున్న సంజూ శాంసన్.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమైనా మిడిలార్డర్‌లో రాణించే సత్తా ఉందని నమ్మకం కలిగించాడు. టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నా సూర్యకుమార్ యాదవ్.. వన్డేలలో మాత్రం కష్టమే అని చెప్పకనే చెప్పాడు. మూడో వన్డేలో మినహా తొలి రెండు వన్డేలలో సూర్య ప్రదర్శన దారుణంగా ఉంది.
బౌలింగ్ గుడ్డిలో మెల్ల..
బౌలింగ్ విషయానికి వస్తే తొలి వన్డేలో భారత్‌ను స్పిన్నర్లు గెలిపించారు. రెండో వన్డేలో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. మూడో వన్డేలో పవర్‌ప్లేలో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్.. ఫర్వాలేదనిపించినా అతడిని వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే అవకాశాలైతే కనిపించడం లేదు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో వేగం తప్ప వైవిధ్యం లేదు. పేస్ విభాగంలో కాస్తో కూస్తో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ఇక స్పిన్నర్ల విషయంలో రవీంద్ర జడేజా ఫ్రంట్ లైన్ స్పిన్నర్‌గా ఉన్నాడు. అతడికి తోడుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. అక్షర్ ఇటీవల కాలంలో బంతితో అద్భుతమైన ప్రదర్శనలైతే చేయలేదు. కానీ అతడు లోయరార్డర్‌లో కీలకమైన బ్యాటర్. కుల్చా (కుల్దీప్ - చాహల్) ద్వయంలో ప్రపంచకప్‌కు ఎవరు ఎంపికవుతారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ కప్ సమీపిస్తున్నందున, తుది జట్టును ఖరారు చేయడానికి, లోపాలను పరిష్కరించుకోవడానికి భారత జట్టుకు మిగిలున్నది చాలా తక్కువ సమయం. ఆగస్టు మాసాంతం నుంచి ఆసియా కప్, ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆసీస్‌తో మూడు వన్డేలు మాత్రమే.. ఇవి ముగిశాక భారత్ నేరుగా ప్రపంచకప్ బరిలోకి దూకాల్సిందే. బౌలింగ్ విభాగం, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్థానాలలో టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని కనిపిస్తున్నది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial