శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా, ముఖేష్ కుమార్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు ఔట్‌లతో చెలరేగగా, వెస్టిండీస్‌తో తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ ఇచ్చిన ఆరంభాన్ని వాడుకున్న సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటతీరుతో 351/5 భారీ స్కోరు సాధించారు. గిల్ 85, కిషన్ 77, హార్దిక్ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు.


వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడింది. మూడో వన్డేలో కూడా భారత్ ప్రయోగాలు చేసింది. భారత్ నిర్దేశించిన  351  పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ బ్యాటర్లు విఫలమయ్యారు కేవలం 151 పరుగులకే వారిని పెవిలియన్ చేర్చడంలో ఇండియన్ బౌలర్లు విజయవంతమవయ్యారు.  విండీస్‌కు చెందిన ఏడుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు. వారి బ్యాటింగ్‌లో 39 పరుగులే అత్యధిక స్కోరు. 






భారత్ తరుపున శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్‌కు మూడు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. దాదాపు పదేళ్ల తర్వాత భారత్ తరఫున వన్డేలు ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ ఒకట వికెట్ తీసుకున్నాడు. 


తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విండీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. గిల్ 92 బంతుల్లో 85 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు బాదాడు. ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో సంజూ శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు.


ఇదీ విండీస్ బౌలింగ్


విండీస్ బౌలర్ల విషయానికొస్తే రొమారియో షెపర్డ్ 10 ఓవర్లలో 73 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటే, యానిక్ కరియా ఒక్కో వికెట్‌ తీశారు. 


ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. సిరీస్ రెండో మ్యాచ్‌లో విండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో టఫ్‌ ఫైట్ ఇచ్చింది. మూడో, చివరి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 1-2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.