IND Vs WI, 3rd ODI: వన్డే సిరీస్‌ను గెలవాలంటే తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా రెచ్చిపోయింది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం  వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో  టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 85, 11 ఫోర్లు)  భారత భారీ స్కోరుకు బాటలువేశారు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్ (41 బంతుల్లో 51, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) నడిపించగా ఆఖర్లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్,  4 ఫోర్లు,  5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ధాటిగా విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపారు. 


ఓపెనర్ల శతక భాగస్వామ్యం.. 


ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన గిల్-కిషన్‌లు  ఆది నుంచే ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ  కలిపి  పోటీపడి మరీ పరుగులు సాధించడంతో భారత్ స్కోరుబోర్డు వేగంగా కదిలింది. ఓవర్‌కు ఏడు రన్ రేట్‌కు తగ్గకుండా ఆడిన ఈ ఇద్దరూ.. తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. 2023లో విదేశాలలో భారత్‌కు ఇదే అత్యుత్తమ  భాగస్వామ్యం.  మోటీ వేసిన 14వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసిన కిషన్.. 43 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా కరియా వేసిన 18వ ఓవర్లో  నాలుగో బంతిని బౌండరీకి తరలించి హాఫ్ సెంచరీ సాధించాడు.  అర్థ సెంచరీ తర్వాత కిషన్ మరింత ధాటిగా ఆడాడు. రొమారియా షెపర్డ్  వేసిన 19వ ఓవర్లో  6,4 బాదాడు.  20 ఓవ్లకే భారత్ స్కోరు 140 దాటింది.


సెంచరీ దిశగా సాగుతున్న కిషన్‌ను కరియా బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 20వ ఓవర్లో నాలుగో బంతికి  ముందుకొచ్చి ఆడబోయిన కిషన్ బంతిని మిస్ అయ్యాడు. వికెట్ల వెనుకాల షై హోప్ మాత్రం మిస్ కాలేదు.  అతడి స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8)  మాత్రం నిరాశపరిచాడు.  


శాంసన్  సిక్సర్ల మోత.. 


నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్.. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఎదుర్కున్న రెండో బంతికే భారీ సిక్సర్ బాదిన సంజూ.. నాలుగో బాల్‌ను కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత జేడన్ సీల్స్ వేసిన 27వ ఓవర్లో కూడా  సిక్స్ కొట్టాడు. శాంసన్ బాదుతుండటంతో గిల్ నెమ్మదించాడు.  సీల్స్ వేసిన 29వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడంతో  భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. కరియా వేసిన 31వ ఓవర్లో 6,4 బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. రొమారియా షెపర్డ్ వేసిన  32వ ఓవర్లో  భారీ షాట్ ఆడబోయి హెట్‌మెయర్ చేతికి చిక్కాడు. దీంతో 69 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి  తెరపడింది.  శాంసన్ నిష్క్రమణ తర్వాత కొద్దిసేపటికే భారత్ .. గిల్ వికెట్ కూడా కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న గిల్.. మోటీ బౌలింగ్‌లో కరియాకు క్యాచ్ ఇచ్చాడు. 


 






ఆఖర్లో  హార్ధిక్ - సూర్య మెరుపులు 


గిల్ ఔటయ్యాక వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి  హార్ధిక్ పాండ్యా  ధాటిగా ఆడి  భారత్‌కు భారీ స్కోరును అందించాడు. ఇద్దరూ  ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అల్జారీ జోసెఫ్ వేసిన 43వ ఓవర్లో 4,6 బాదిన సూర్య.. జేడన్ సీల్స్ వేసిన  46వ ఓవర్లో ఐదో బంతిని డీప్ పాయింట్ దిశగా  సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్‌‌తో భారత్ స్కోరు 300 మార్కును దాటింది. షెపర్డ్ వేసిన 47వ ఓవర్లో సూర్య నిష్క్రమించినా ఆఖర్లో హార్ధిక్ మెరుపులతో భారత్.. 351 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ బౌలింగ్‌లో హార్ధిక్.. 6,4, 6, 2తో 18 పరుగులు రాబట్టి భారత్ స్కోరును 350 మార్క్ దాటించాడు. హార్ధిక్‌తో పాటు రవీంద్ర జడేజా (8 నాటౌట్ ) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు తీయగా జోసెఫ్,  కరియా, మోటీలు తలా ఓ వికెట్ పడగొట్టారు. 

















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial