ICC ODI World Cup 2023: మరో రెండు నెలలలో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత  క్రేజ్ కలిగిన  ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ తేదీ మార్పునకు రంగం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో  గుజరాత్‌ (అహ్మదాబాద్)‌లో భద్రతా  కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ తేదీని ఒకరోజు ముందుగానే నిర్వహించాలని  రాష్ట్ర సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి వచ్చిన  వినతి మేరకు  బీసీసీఐ.. ఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే దీనికి  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకారం తెలపడంతో ఐసీసీ  కూడా షెడ్యూల్ మార్పునకు ఆమోదముద్ర వేసింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా  వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న కాకుండా 14నే  జరుగనుంది. 


నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచే మొదలుకానున్నాయి.  అదే రోజు  గుజరాత్‌లో అత్యంత ప్రాచుర్యం కలిగిన గర్భా వేడుకలు జరుగుతాయి.  అహ్మదాబాద్‌లో ఈ వేడుక కన్నులపండవగా ఉంటుంది.  అయితే ఇదే రోజు అహ్మదాబాద్‌లో  భారత్  - పాక్ వంటి హై ప్రొఫైల్ మ్యాచ్ నిర్వహణ  గుజరాత్ పోలీసులకు కత్తిమీద సాము వంటిదే. ఈ నేపథ్యంలో  మ్యాచ్ తేదీని మార్చాలని  స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు  బీసీసీఐని కోరాయి. అయితే ఈ మ్యాచ్ తేదీని మార్చాలంటే   పాకిస్తాన్ అంతకంటే ముందు ఆడాల్సిన మ్యాచ్ తేదీలను కూడా మార్చాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో బీసీసీఐ అప్డేటెడ్ షెడ్యూల్‌‌ను ఐసీసీతో పాటు పీసీబీకి పంపింది. పీసీబీ దీనికి ఆమోదముద్ర వేసింది. 


కొత్త షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్..  అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో  జరగాల్సిన మ్యాచ్‌ను 10నే ఆడనుంది.  దీంతో భారత్‌తో ఆడబోయే  మ్యాచ్‌కు ఆ జట్టుకు విరామం కూడా దొరుకుతుంది.  కాగా  అప్డేటెడ్ షెడ్యూల్‌‌ను  బీసీసీఐ, ఐసీసీ త్వరలోనే ట్విటర్ వేదికగా విడుదల చేయనున్నాయి. 


 






ఐసీసీ గత నెలలో ప్రకటించిన  మేరకు ప్రస్తుతం పాకిస్తాన్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.


- అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
- అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక - హైదరాబాద్
- అక్టోబర్ 15 : పాకిస్తాన్ వర్సెస్ ఇండియా - అహ్మదాబాద్
- అక్టోబర్ 20 : పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా - బెంగళూరు 
- అక్టోబర్ 23 : పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్ - చెన్నై
- అక్టోబర్ 27 : పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా - చెన్నై
- అక్టోబర్ 31 : పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
- నవంబర్ 04 : పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ - బెంగళూరు


త్వరలో మారబోయే షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్.. శ్రీలంకతో అక్టోబర్ 10న, భారత్‌తో అక్టోబర్ 14న ఆడనుంది.  


 






















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial