Hardik Pandya: రోహిత్ శర్మ‌కు రెస్ట్ ఇచ్చి ప్రయోగాలను  మూడో వన్డేలో కూడా కొనసాగించిన భారత జట్టు..  ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  హార్ధిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన భారత జట్టు.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా  అత్యద్భుత  ప్రదర్శనతో ఆకట్టుకోంది. సిరీస్ సాఫీగానే ముగిసినా  టీమిండియా   టెంపరరీ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు మాత్రం    వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ)పై కోపమొచ్చింది. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో  విండీస్ బోర్డు విఫలమైందన్నట్టుగా  హార్ధిక్ మాట్లాడాడు.  


ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా మూడో వన్డే  ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో హార్ధిక్ మాట్లాడుతూ.. ‘మేం ఆడినవాటిలో ఇది  కూడా చాలా మంచి గ్రౌండ్. అయితే  మేం మళ్లీ వచ్చేటప్పటికైనా వెస్టిండీస్‌ స్టేడియాలలో సౌకర్యాలు మెరుగుపడుతాయని ఆశపడుతున్నా.  ట్రావెలింగ్ నుంచి మొదలుకుని చాలా విషయాల్లో మేం ఇబ్బందులు పడ్డాం. గతేడాది కూడా ఇలాగే జరిగింది...


వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా.   వచ్చే పర్యటన వరకైనా సౌకర్యాలు మెరుగుపడతాయని అనుకుంటున్నా. మేమేం  విలాసాలు కోరుకోవడం లేదు.  కానీ కనీస సౌకర్యాలు కల్పించినా చాలు.. ఇదొక్కటి మినహా మేము ఆటను చాలా ఆస్వాదించాం..’అని చెప్పాడు. కాగా కొద్దిరోజుల క్రితమే  భారత క్రికెట్ జట్టు  పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్టు ఆడిన తర్వాత  బార్బడోస్ చేరడానికి  విమానాశ్రయంలో ఇబ్బందులు పడింది.   రాత్రి విమానం క్యాన్సిల్ కావడంతో నాలుగు గంటల పాటు భారత క్రికెటర్లు  ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై టీమిండియా.. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేసి తమకు రాత్రి ప్రయాణాలను తప్పించాలని కోరింది. 


హార్ధిక్ కామెంట్స్‌పై నెటిజన్లు కూడా  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో సంపన్న బోర్డుగా ఉన్న  బీసీసీఐతో.. క్రికెటర్లకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న విండీస్ క్రికెట్ బోర్డును పోల్చి చూడటం సరికాదని వాపోతున్నారు.  


 






ఇక మ్యాచ్ విషయానికొస్తే..  భారత్ నిర్దేశించిన  351  పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరుపున శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్‌కు మూడు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 85, 11 ఫోర్లు)  భారత భారీ స్కోరుకు బాటలువేశారు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్ (41 బంతుల్లో 51, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) నడిపించగా ఆఖర్లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్,  4 ఫోర్లు,  5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ధాటిగా విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపారు.


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial