Bangladesh vs England:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మంగళవారం రెండు మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను బంగ్లాదేశ్ ఢీకొట్టబోతోంది. ధర్మశాల వేదికగా ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో గెలిచి బోణీ కొట్టాలని బట్లర్ సేన పట్టుదలగా ఉంది. అఫ్గాన్‌పై గెలుపు జోష్‌ను ఇందులోనూ కొనసాగించాలని షకిబ్ సేన భావిస్తోంది. మరి ఈ మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
మొదటి మ్యాచులో షాక్
డిఫెండింగ్ ఛాంపియన్‌గా మెగా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌కు మొదటి మ్యాచులో మైండ్ బ్లాంక్ అయింది. రన్నరప్ న్యూజిలాండ్ ఊహించని షాకిచ్చింది. ఏకంగా 82 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమి నుంచి ఆంగ్లేయులు పాఠాలు నేర్చుకొనే ఉంటారు. పైగా బంగ్లాపై వారిదే పైచేయి! ఐదేళ్లుగా ఫియర్‌లెస్ క్రికెట్‌కు అడ్డాగా మారిన ఇంగ్లాండ్ ఉపఖండం పిచ్‌లపై జాగ్రత్తగా ఆడాలి. జట్టులో స్పిన్నర్లపై ఎదురుదాడి చేసేవాళ్లు తక్కువగా ఉన్నారు.
ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్‌లో ఎవరో ఒకరు నిలవాలి. మాజీ కెప్టెన్ జో రూట్, కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్‌లో ఉండటం సానుకూల అంశం. లివింగ్‌స్టన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ తమ స్థాయికి తగినట్టు ఆడాలి. మామూలుగా ఇంగ్లాండ్ బౌలింగ్ బాగుంటుంది. అలాంటిది వారి బౌలింగ్‌ను కివీస్ ఊచకోత కోసింది. వారి లోపాలను ఎత్తి చూపించింది. వెంటనే సరిదిద్దుకోవడం ముఖ్యం. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూర్పు మెరుగవ్వాలి. స్పిన్నర్లు ప్రభావం చూపాలి. మార్క్‌వుడ్ లైన్ అండ్ లెంగ్తులు త్వరగా దొరకబుచ్చుకోవాలి.
ఆత్మవిశ్వాసంతో బరిలోకి
తొలి మ్యాచులో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌కు ఇంగ్లాండ్‌తో పోరు సవాలే! కఠినమైన పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి మ్యాచులో ఓడిన ఆంగ్లేయులు ఈ సారి కసిగా ఆడతారు. పైగా ధర్మశాల వారి సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బంగ్లా ఓపెనర్లు తంజిద్ హసన్, లిటన్ దాస్ మరింత మెరుగవ్వాలి. మెహదీ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో హాఫ్ సెంచరీలు చేసి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఇంకాస్త బాధ్యతాయుతంగా ఉండాలి. బౌలింగులో షకిబ్, మెహదీ రెచ్చిపోతున్నారు. భారత్ పిచ్‌లపై వారికి అనుభవం ఉంది. బ్యాటింగ్ డిపార్టుమెంట్లోనే బలహీనతలు కనిపిస్తున్నాయి. వాటిని సరిదిద్దుకుంటే ఆంగ్లేయులను కచ్చితంగా వణికించగలరు. పైగా తమదైన రోజున బంగ్లా పులులు గర్జించగలవు.
బంగ్లాదేశ్ జట్టు (అంచనా): తంజిద్ హసన్, లిటన్ దాస్, మెహెదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, తోహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఇంగ్లాండ్ జట్టు (అంచనా): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జోరూట్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్