ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ రెండో వన్డేలో టీమ్‌ఇండియాకు అఫ్గానిస్థాన్ మెరుగైన లక్ష్యమే నిర్దేశించింది. 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8x4, 1x6), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (62; 69 బంతుల్లో 2x4, 4x6) అర్ధశతకాలు బాదేశారు. టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా మళ్లీ మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. 39 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ పాండ్య 2 వికెట్లు తీశాడు.


బుమ్రా.. ఈజ్‌ బ్యాక్‌!


దిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం! మందకొడి పిచ్‌ కావడంతో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. టీమ్‌ఇండియా పేసర్లు చురకత్తుల్లాంటి బంతులు వేయడంతో ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌ (21), ఇబ్రహీం జద్రాన్‌ (22) నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. 6.4వ బంతికి జద్రాన్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. సరిగ్గా ఆరు ఓవర్ల తర్వాత గుర్బాజ్‌ను పాండ్య పెవిలియన్‌కు పంపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రెహ్మత్‌ (16)ను శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీగా పంపించాడు.


ఆదుకున్న ఇద్దరు!


63 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ అఫ్గాన్‌ను షాహిది, ఒమర్‌జాయ్‌ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 128 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీమ్‌ఇండియా బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. చక్కని బౌండరీలు బాదేశారు. వీరిద్దరి ఆటతీరుతోనే అఫ్గాన్‌ రెండో పవర్‌ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 163 పరుగులు సాధించింది. ఒమర్‌ జాయ్‌ 62, షాహిది 58 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు అందుకోవడంతో అఫ్గాన్‌ స్కోర్‌ 36.4 ఓవర్లకు 200కు చేరింది. అయితే జట్టు స్కోరు 184 వద్ద ఒమర్‌జాయ్‌ను పాండ్య బౌల్డ్‌ చేశాడు. 225 వద్ద షాహిదిని కుల్‌దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నెమ్మదిగా ఆడటంతో అఫ్గాన్‌ 272/8కి పరిమితమైంది.


భారత్‌ జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌


అప్గానిస్థాన్‌ జట్టు: రెహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీమ్‌ జర్దాన్‌, రెహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, నజీబుల్లా జద్రాన్, మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, నవీన్‌ ఉల్‌ హఖ్‌, ఫజల్‌ హక్‌ ఫారుఖీ


పిచ్‌ రిపోర్టు: పిచ్‌ బెల్టర్‌లా ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు. వికెట్‌ బాగుందన్నాడు. ఈ వేదికలో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 230. కానీ శ్రీలంకతో మ్యాచులో దక్షిణాఫ్రికా 428 కొట్టింది. అందుకే 350 చేస్తే సులభంగా గెలవొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. మైదానం ఆకృతిని బట్టి ఆఫ్‌ స్పిన్నర్లకు కాస్త సవాలే.