NZ-W vs SL-W: క్రికెట్ లో మ్యాచ్ ను సజావుగా సాగేలా చూసేది అంపైర్లే.. గేమ్ వాళ్ల నియంత్రణలోనే ఉంటుంది. కొన్నికొన్నిసార్లు వాళ్లు చేసే చిన్న తప్పిదాలు ఓ జట్టుకు భారీ నష్టాన్నే చేకూర్చుతాయి. ఇటీవల శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన మహిళల వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఇలాంటి బ్లండర్ ఒకటి చర్చనీయాంశమైంది. కివీస్ బౌలర్ ఎడెన్ కార్సెన్.. వన్డేలలో పరిమితికి మించి 11 ఓవర్లు వేసింది. 50 ఓవర్ల ఫార్మాట్ వచ్చాక ఒక బౌలర్ 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి.
అంపైర్లు మరిచిపోయి..
శ్రీలంక పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. గాలె వేదికగా జరిగిన రెండో వన్డేలో అంపైర్లు, కివీస్ కెప్టెన్ ఈ తప్పిదం చేశారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక ఇన్నింగ్స్ లో పది ఓవర్లు పూర్తి చేసుకున్న ఆఫ్ స్పిన్నర్ ఎడెన్ కార్సెన్.. 11 ఓవర్ కూడా వేసింది. లంక ఇన్నింగ్స్ లో 45వ ఓవర్ లోనే కార్సెన్ పది ఓవర్ల కోటా పూర్తయింది. పది ఓవర్లలో ఆమె 46 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసింది.
కానీ కివీస్ కెప్టెన్ సోఫీ డెవిన్ మరిచిపోయి కార్సెన్ కు 47వ ఓవర్లో కూడా వేయాలని బంతినిచ్చింది. అంపైర్లు కూడా కార్సెన్ పది ఓవర్లు ముగిశాయన్న విషయం మరిచిపోయారు. థర్డ్ అంపైర్లు, స్టాట్స్ వేసే వాళ్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో ఆమె 11వ ఓవర్ వేసింది. తనకు ఎక్స్ట్రాగా దక్కిన ఓవర్ లో కార్సెన్.. మరో పరుగు ఇచ్చింది. తీరా ఓవర్ ముగిశాక ఆమె 11 ఓవర్లు వేసింది అని స్క్రీన్స్ పై కనబడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
1993 తర్వాత..
ఐసీసీ.. వన్డేలలో 55 ఓవర్ల ఫార్మాట్ లో ఛేంజెస్ చేసి 1995లో దానిని 50 ఓవర్లకు కుదించింది. 55 ఓవర్ల ఫార్మాట్ ఉన్నప్పుడు వన్డేలలో ఒక బౌలర్ 11 ఓవర్లు వేయడానికి ఆస్కారం ఉండేది. కివీస్ తరఫున (మహిళా క్రికెట్ లో) వన్డేలలో 11 ఓవర్లు వేసిన బౌలర్ (1993 తర్వాత) కార్సనే కావడం గమనార్హం.
ఆ నలుగురు కూడా..
కార్సన్ కంటే ముందు అంపైర్లు, స్టాట్స్ డిపార్ట్మెంట్ లో తప్పుల కారణంగా 1995 తర్వాత కూడా నలుగురు బౌలర్లు వన్డేలలో 10 ప్లస్ ఓవర్లు బౌలింగ్ చేశారు. వారిలో నీతూ డేవిడ్ (ఇండియా - 2004), గాయత్రి కరియవసమ్ (శ్రీలంక - 1998), పూర్ణిమ (ఇండియా- 1995), మహ్మద్ రఫిక్ (బంగ్లాదేశ్ - 1995) లు ఈ జాబితాలో ఉన్నారు.
ఇక న్యూజిలాండ్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. గాలెలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డెవిన్ (137), మెలి కెర్ (108) లు సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం శ్రీలంక.. 48.4 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది.