Glenn Phillips smashes century:  ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో సెంచరీల మోత మోగుతోంది. మొన్నే దక్షిణాఫ్రికా బ్యాటర్‌ రిలీ రొసొ శతక బాదేశాడు. తాజాగా న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్ ఫిలిప్స్‌ (104; 64 బంతుల్లో 10x4, 4x6) సెంచరీ అందుకున్నాడు. సిడ్నీలో శ్రీలంకపై దుమ్మురేపాడు. అతడికి డరైల్‌ మిచెల్‌ (22) అండగా నిలవడంతో కివీస్‌ 20 ఓవర్లకు 167/7తో నిలిచింది. కసున్‌ రజిత 2 వికెట్లు పడగొట్టాడు. తీక్షణ, ధనంజయ, హసరంగ, లాహిరు కుమారకు తలో వికెట్‌ దక్కింది.




ఆహా.. ఫిలిప్స్‌!


మందకొడి పిచ్‌ కావడంతో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పవర్‌ప్లే ముగిసే సరికే 3 వికెట్లు నష్టపోయి విలవిల్లాడింది. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికి ఫిన్‌ అలెన్ (1)ను థీక్షణ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 7 వద్ద డేవాన్‌ కాన్వే (1)ను ధనంజయ డిసిల్వా పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (8) రజిత ఔట్‌ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ క్రీజులో నిలబడ్డాడు. లంకేయులు ఇచ్చిన లైఫ్‌లును చక్కగా వినియోగించుకున్నాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని వేటాడాడు.


మిచెల్‌తో కలిసి ఫిలిప్స్‌ నాలుగో వికెట్‌కు 64 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న అతడు ఆపై మరింత చెలరేగాడు. మరో వైపు వికెట్లు పడుతున్నా డెత్‌ ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలు బాదేసి 61 బంతుల్లో సెంచరీ బాదేశాడు. టీ20 ప్రపంచకప్పుల్లో రెండో సెంచరీ బాదిన న్యూజిలాండర్‌గా రికార్డు సృష్టించాడు. 19.4వ బంతికి భారీ షాట్‌ ఆడబోయిన అతడిని కుమార లాహిరు ఔట్‌ చేయడంతో కివీస్‌ 167/7తో నిలిచింది.