IND vs SA Perth Weather: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమ్‌ఇండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది! పెర్త్‌ వేదికగా ఆదివారం మూడో మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌ 2లో అత్యంత ప్రమాదకరమైన దక్షిణాఫ్రికాతో సాయంత్రం 4:30 (భారత కాలమానం) గంటలకు తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచులు వర్షంతో రద్దవుతుండటంతో ఈ పోరుపై ఆసక్తి నెలకొంది. ఆదివారం పెర్త్‌ వాతావరణం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆరా తీస్తున్నారు.


కొన్ని రోజులుగా వర్షం


లా నినా కారణంగా కొంత కాలంగా ఆస్ట్రేలియాలో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు మ్యాచులు వర్షం వల్ల బంతి పడకుండానే రద్దయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే మెల్‌బోర్న్‌లో రెండు మ్యాచులు ఇలా ముగిశాయి. అందుకే పెర్త్‌ వాతావరణం గురించి అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చేదు వార్త ఏంటంటే కొన్ని రోజులుగా ఈ నగరంలో వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. శనివారం సైతం వాన దేవుడి రాకపై అంచనాలు ఉన్నాయి. మధ్యాహ్నం 8, సాయంత్రం 16, అర్ధరాత్రి 37 శాతం మేర వాన కురుస్తుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు ఎక్కువ జల్లులు పడతాయని అంటున్నారు.


మ్యాచ్‌కు అవకాశం!


ఆదివారం మాత్రం వర్షం పడే అవకాశాలు తక్కువేనని అంచనా! అయితే లానినా కారణంగా ఎప్పుడు జల్లులు కురుస్తాయో చెప్పలేని పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు మబ్బులు కమ్ముకోవడమే కాకుండా చల్లని గాలులు వీస్తాయి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. ఇదే జరిగితే అభిమానులు మ్యాచును పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఒకవేళ జల్లులు పడ్డా వర్షం తక్కువే ఉంటుందని అంటున్నారు. అయితే రాత్రి కావడంతో గాలులు బలంగా వీస్తాయి. చల్లని వాతావరణంలోనే మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.


ఫాస్టెస్ట్‌ పిచ్‌!


ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిచ్‌ల్లో పెర్త్‌ ఒకటి. ఆప్టస్‌ స్టేడియంలోని వికెట్‌ ఫాస్ట్ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తుంది. పైగా మంచి బౌన్స్‌ ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని ఆన్రిచ్‌ నోకియా, రబాడా, లుంగి ఎంగిడితో టీమ్‌ఇండియాకు ప్రమాదం తప్పదు! చల్లని గాలికి తోడు మబ్బులుంటే బంతి చక్కగా స్వింగ్‌ అవుతుంది. అయితే బంతిని చక్కగా టైమింగ్‌ చేసే బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తారు. ఔట్‌ ఫీల్డ్‌ సైతం వేగంగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 167గా ఉంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బౌలింగ్‌ తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు. షార్ట్‌ బౌండరీలను బ్యాటర్లు టార్గెట్‌ చేస్తే రన్స్‌ వస్తాయి.