IND vs SA, T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమ్‌ఇండియా మూడో సూపర్‌ 12 మ్యాచుకు రెడీ! గ్రూపులో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను ఆదివారం ఢీకొట్టనుంది. పెర్త్‌ మైదానం ఇందుకు వేదిక. సాయంత్రం 4:30 (భారత కాలమానం) ఆట మొదలవుతుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్‌ గెలవడం అత్యంత కీలకం! మరి విజయం ఎవరిని వరించబోతోంది? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్‌ కండిషన్స్‌ ఏంటి?


ఎవరు ఎక్కడ?


గ్రూప్‌ 2లో టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. చిరకాల శత్రువు పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ను ఓడించిన హిట్‌మ్యాన్‌ సేన 4 పాయింట్లు, 1.42 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. సఫారీలను దురదృష్టం వెంటాడింది. మరో 5 నిమిషాల్లో గెలుస్తారనగా జింబాబ్వే మ్యాచ్‌ రద్దైంది. దాంతో ఒక పాయింటే వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను 104 తేడాతో ఓడించి మొత్తం 3 పాయింట్లు, 5.200 రన్‌రేట్‌తో రెండో స్థానానికి వచ్చేశారు.


జోష్‌లో భారత్‌!


ప్రస్తుతం టీమ్‌ఇండియా జోష్‌లో ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తిరుగులేదు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మినహా టాప్‌ ఆర్డర్లో అంతా రాణిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ వరుసగా 2 హాఫ్‌ సెంచరీలు చేశాడు. రోహిత్‌, సూర్యకుమార్‌ దంచికొడుతున్నారు. మిడిలార్డర్లో హార్దిక్‌ పాండ్య కీలకం. అక్షర్‌ పటేల్‌, డీకే, అశ్విన్‌ బ్యాటుతో కంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంది. సఫారీలపై రాహుల్‌ ఫామ్‌లోకి రావాలని యాజమాన్యం కోరుకుంటోంది. యాష్‌, అక్షర్‌ తమ స్పిన్‌ బౌలింగ్‌తో పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లు పడగొడుతున్నారు. అర్షదీప్‌ వైవిధ్యమైన యాంగిల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. భువీ, షమి నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నారు. పాండ్య చక్కని బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నాడు.


డేంజరస్‌ సఫారీ!


కెప్టెన్‌ తెంబా బవుమా ఫామ్‌లో లేకపోవడం దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెడుతోంది. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ వేగంగా రన్స్‌ చేస్తున్నాడు. పవర్‌ప్లే బౌలర్లను అటాక్‌ చేస్తున్నాడు. బంగ్లాపై సెంచరీ బాదేసిన రిలీ రొసో జోరుమీదున్నాడు. స్పిన్‌, పేస్‌ను ఎదుర్కొనే డేవిడ్‌ మిల్లర్‌ మిడిలార్డర్లో అత్యంత కీలకం. హెన్రిక్‌ క్లాసెన్‌, రెజా హెండ్రిక్స్‌తో ప్రమాదమే! సఫారీ బౌలింగ్‌కు ఎదురు లేదు. 150 KMPHతో బంతులేసే ఆన్రిచ్‌ నోకియా లయ అందుకున్నాడు. కాగిసో రబాడా, లుంగి ఎంగిడి అతడికి తోడుగా ఉన్నారు. ఆల్‌రౌండర్‌ వేన్‌ పర్నెల్‌ వీరికి అదనం. స్పిన్నర్‌ తబ్రైజ్ శంషి ఆసీస్‌ పిచ్‌లను చక్కగా ఉపయోగించుకొని వికెట్లు తీస్తున్నాడు.


భారత్‌, దక్షిణాఫ్రికా తుది జట్లు (అంచనా)


భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌


దక్షిణాఫ్రికా: తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌, రిలీ రొసో, అయిడెన్‌ మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, త్రిస్టన్‌ స్టబ్స్‌, వేన్‌ పర్నెల్‌, కేశవ్‌ మహరాజ్‌, కాగిసో రబాడా, ఆన్రిచ్‌ నోకియా, తబ్రైజ్‌ శంషి


పేసర్ల పిచ్‌!


ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిచ్‌ల్లో పెర్త్‌ ఒకటి. ఆప్టస్‌ స్టేడియంలోని వికెట్‌ ఫాస్ట్ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తుంది. పైగా మంచి బౌన్స్‌ ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని ఆన్రిచ్‌ నోకియా, రబాడా, లుంగి ఎంగిడితో టీమ్‌ఇండియాకు ప్రమాదం తప్పదు! చల్లని గాలికి తోడు మబ్బులుంటే బంతి చక్కగా స్వింగ్‌ అవుతుంది. అయితే బంతిని చక్కగా టైమింగ్‌ చేసే బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తారు. ఔట్‌ ఫీల్డ్‌ సైతం వేగంగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 167గా ఉంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బౌలింగ్‌ తీసుకొని ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు. షార్ట్‌ బౌండరీలను బ్యాటర్లు టార్గెట్‌ చేస్తే రన్స్‌ వస్తాయి.