New Zealand Announced Their T20 World Cup Squad :  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) నకు న్యూజిలాండ్‌(New Zealand) జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్(Kane Williamson) టీ 20 ప్రపంచకప్‌లోని న్యూజిలాండ్‌ జట్టుకు నాలుగోసారి నాయకత్వం వహించనున్నాడు, బొటనవేలు గాయం నుంచి కోలుకున్న కివీస్‌ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కూడా పొట్టి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. బొటన వేలి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. బౌలర్ మాట్ హెన్రీ, బ్యాటింగ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రకు కూడా టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కింది. న్యూజిలాండ్‌ జట్టులో టిమ్ సౌథీకి ఏడు టీ 20 ప్రపంచ కప్‌లో ఆడిన అనుభవం ఉండగా... విలియమ్సన్‌కు ఆరు టీ20 ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉంది. టీ 20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ టిమ్‌ సౌథీ రికార్డు సృష్టించాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా అయిదోసారి టీ 20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ ప్రకటించిన 15మంది సభ్యులున్న జట్టులో 13 మంది ఆటగాళ్లు అనుభవజ్ఞులేకాగా...ఇద్దరు కొత్తవారికి మాత్రమే స్థానం దక్కింది. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు కరేబియన్ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడుతుండడం కివీస్‌ జట్టుకు లాభించనుంది. 




 

వీరిది దక్కలేదు

ఈ 15 మంది ఆటగాళ్లతో పాటు న్యూజిలాండ్‌ పేస్ బౌలర్ బెన్ సియర్స్ కూడా జట్టుతోపాటే వెళ్లనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక అతను శిక్షణలో పాల్గొంటాడు. చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆడమ్ మిల్నేకు టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. కైల్ జామీసన్ కూడా వెన్ను నొప్పి కారణంగా జట్టులో చోటు దక్కలేదు. గాయాన్ని పునరావాసం కొనసాగిస్తున్నందున ఎంపికకు అందుబాటులో లేడు.

టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న వారందరికీ కివీస్‌ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ శుభాకాంక్షలు తెలిపారు. వెస్టిండీస్‌లోని వేదికలు చాలా వైవిధ్యమైన పరిస్థితులను అందిస్తాయని... ఆ పరిస్థితులను తట్టుకుని రాణించగల అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని ఆయన తెలిపారు. హెన్రీ, రచిన్‌ రవీంద్రకు తొలిసారి టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

 

వినూత్నంగా ప్రకటన

ఇద్దరు చిన్నారులతో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించి న్యూజిలాండ్‌ టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన ఆంగస్, మటిల్దా టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టును ప్రకటించారు. ఒకరు ఆటగాడి పేరు చదువుతూ ఉండగా.. మరొకరు వారు ఎక్కడి నుంచి వచ్చారనేది వివరించారు. మెగా టోర్నీ కోసం కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ను ఎంచుకున్నామని ఆ చిన్నారులు ప్రకటించారు. అనంతరం న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ జట్టు గురించి వెల్లడించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

టీ 20 ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్‌ జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్మీ సౌత్. బెన్ సియర్స్ (ట్రావెలింగ్ రిజర్వ్).