న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ చాలా ప్రొఫెషనల్ జట్టని, వాళ్లు మైదానంలో ప్రత్యర్థి జట్టు ఇచ్చిన ఏ అవకాశాన్ని అంత తేలిగ్గా వదలరని విరాట్ అన్నాడు. భాగస్వామ్యాలను నిర్మించడం.. స్థిరంగా ఆడడమే న్యూజిలాండ్ జట్టు విజయాలకు కారణమని కోహ్లీ విశ్లేషించాడు. కివీస్ జట్టు ప్రశంసలకు అర్హమైన జట్టన్న విరాట్, ప్రత్యర్ధి జట్టు లయను దెబ్బ తీయడంతో వారు ఆరితేరారని ప్రశంసించాడు. న్యూజిలాండ్ ఓడించేందుకు ప్రతీసారి సరికొత్త మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. మైదానంలో న్యూజిలాండ్ చాలా తక్కువ తప్పులు చేస్తుందని కోహ్లీ తెలిపాడు. నిలకడగా అత్యుత్తమంగా రాణిస్తేనే కివీస్‌ను ఎదుర్కోగలమని.. టీమిండియాకు ఆ సత్తా ఉందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తప్పులు చేయకుంటే సగం మ్యాచ్ గెలచినట్లే అని కోహ్లీ చెప్పాడు.
వ్యూహాత్మక బలం
న్యూజిలాండ్ వ్యూహాత్మకంగా కూడా చాలా బలంగా ఉందన్న కోహ్లీ, వారు పక్కా ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేస్తారని అన్నాడు. ప్రత్యర్థి జట్టులోని ప్రతీ ఆటగాడిపై వాళ్లకు ప్రత్యేకమైన వ్యూహాలు ఉంటాయని విరాట్ తెలిపాడు. ఇదే సందర్భంలో రోహిత్ శర్మ సారథ్యాన్ని కోహ్లీ ప్రశంసించాడు. కచ్చితమైన వ్యూహాలను సరైన సమయంలో అమలు చేసి రోహిత్ సారధిగా.. బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటుతున్నాడని కొనియాడాడు. బలమైన ప్రత్యర్థితో ఆడినప్పుడే అత్యుత్తమమైన ఆట బయటకొస్తుందని తెలిపాడు. కివీస్ క్రమం తప్పకుండా ICC టోర్నమెంట్‌లలో టీమిండియాను ఓడించారని, కానీ ఈసారి పరిస్థితులు అలా ఉండబోవని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
కివీస్ పై 3 సార్లు విజయం
వన్డే ప్రపంచకప్‌లో భారత్ - న్యూజిలాండ్ ఎనిమిదిసార్లు తలపడగా కివీస్ ఐదుసార్లు విజయం సాధించింది. 2015, 2019 ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. 2021లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో కివీస్‌పై మంచి రికార్డు లేని టీమిండియా.. ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తోంది. 2003 ప్రపంచకప్‌లో సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు, కివీస్‌ను ఓడించింది. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు.
కీలక సమరం
ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ విశ్వ సమరంలో అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో ఇంతవరకు ఓటమి ఎరుగని రెండు జట్లు మైదానంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌తో రోహిత్ సేన ఢీ కొనబోతోంది. కివీస్‌తోనే భారత జట్టుకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. వరుస విజయాలతో టీమ్‌ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై సెంచరీ చేసిన రోహిత్... దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కూడా మంచి ఇన్నింగ్సులు ఆడాడు. కోహ్లీ కూడా మంచి ఫామ్ అందిబుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విలువైన స్కోర్ అందిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో వీరు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.