అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. టాస్‌ గెలిచిన అఫ్గాన్‌... కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌... అఫ్ఘానిస్థాన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. అయితే కివీస్‌ స్కోరు 30 పరుగుల వద్ద ఉండగా ముజీబుర్‌ రెహ్మాన్‌ తొలి వికెట్‌ తీశాడు. 20 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన కాన్వేను వికెట్లముందు దొరకబుచ్చుకున్న రెహ్మాన్‌ అఫ్గాన్‌కు తొలి వికెట్‌ అందించాడు. అనంతరం ఓపెనర్‌ విల్‌ యంగ్‌తో జత కలిసిన రచిన్‌ రవీంద్ర ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. క్రమంగా పరుగుల వేగం పెంచుతున్న ఈ ఇద్దరు బ్యాటర్లు.. అఫ్గాన్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. యంగ్‌ 50, రచిన్‌ రవీంద్ర 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

 

వన్డే ప్రపంచకప్ విషయానికొస్తే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండుసార్లు తలపడగా, 2 మ్యాచ్ ల్లోనూ కివీస్ విజయం సాధించి 2-0 తో పైచేయి సాధించింది. కానీ 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ ను ఓడించిన తరువాత అఫ్గాన్ జట్టును మరే జట్టు అంత తేలికగా తీసుకోవని చెప్పవచ్చు. అఫ్గాన్ చిన్నజట్టుగా కనిపించినా, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణిస్తూ పెద్ద జట్లను ఇబ్బంది పెడుతోంది. 

 

విలియమ్సన్‌ దూరం

గాయం కారణంగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇదివరకే మెగా టోర్నీలో తొలి 2 మ్యాచ్ లకు దూరమైన విలిమయ్సన్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో మరోసారి గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ (107 బంతుల్లో 78 రన్స్) తరువాత చేతి బొటనవేలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మరోసారి గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగతున్న మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ లో మోకాలి గాయం కారణంగా కొన్ని నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. జట్టులోకి వచ్చాడని అభిమానులు సంతోషించేలోపే విలియమ్సన్ గాయపడ్డాడు. టోర్నీలో మళ్లీ ఎప్పుడు జట్టులోకి వస్తాడన్నదానిపై స్పష్టత లేదు. 

పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, 3 మ్యాచ్ లకుగానూ ఒక్కటి నెగ్గిన అఫ్గాన్ 6వ స్థానంలో నిలిచింది. అఫ్గాన్ పై నెగ్గితే 8 పాయింట్లతో అగ్ర స్థానం కివీస్ దే. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్ మరో విజయంపై ఫోకస్ చేస్తోంది. 

 

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డీజే మిచెల్, రచిన్ రవీంద్ర, ఎంఎస్ చాప్ మన్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, ఫెర్గూసన్, ఎంజే హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి.

 

ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, ఆర్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్ జాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఐఏ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్ -ఉల్-హక్.