ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి నెదర్లాండ్స్ పెను ప్రకంపనలు సృష్టించింది. తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందన్న దశ నుంచి అమాంతం పుంజుకుని మహా సంగ్రామంలో అద్భుతం చేసింది. అన్ని విభాగాల్లో రాణించి ప్రొటీస్‌కు మరచిపోలేని షాక్ ఇచ్చింది. అయితే నెదర్లాండ్స్ అద్భుత విజయం వెనక ఒక ఆటగాడి పాత్ర ఎంతో ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్ఫూర్తి నింపుతూ.. బంతితోనూ బ్యాట్‌తోనూ రాణిస్తున్న ఆ కీలక ఆటగాడే రోలోఫ్ వాన్ డెర్ మెర్వే. దక్షిణాఫ్రికాలో పుట్టి.. అక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుని... ప్రొటీస్ జట్టుతో కలిసి అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడిన మెర్వే.. ఇప్పుడు ఆ జట్టు ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించాడు. సఫారీ జట్టును వీడి నెదర్లాండ్స్ జట్టులో చేరే వరకు మేర్వే ప్రయాణం స్ఫూర్తి దాయకమే.
క్రికెట్ ఓనమాలు దక్షిణాఫ్రికాలోనే...
వాన్ డెర్ మెర్వే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీల్లో మెర్వే ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. దక్షిణాఫ్రికా తరపున అండర్-19, సౌతాఫ్రికా-A జట్ల తరపున కూడా ఆడాడు. 2009వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వాన్ డెర్ మెర్వే... 2009-2010 మధ్య 13 వన్డేలు, 13టీ ట్వంటీలు ఆడాడు. 2015 వరకు దక్షిణాఫ్రిగా జట్టులో అవకాశాల కోసం ఎదురు చూశాడు. కానీ స్థిరమైన అవకాశాలు రాకపోవడంతో ఈ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్-రౌండర్ సఫారీ జట్టును వదిలి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లాడు.
నెదర్లాండ్స్‌తో ప్రయాణం ఇలా...
2015లో మెర్వే నెదర్లాండ్స్ జట్టులో చేరాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సారిగా డచ్ జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 2016లో భారత్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌నకు ఇక్కడికి వచ్చాడు. 2015 నుంచి 2019 వరకు టీ ట్వంటీలకే పరిమితమైన మెర్వే 2019లో వన్డేల్లో జట్టులోకి వచ్చాడు. 2021, 2022లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్‌లోనూ నెదర్లాండ్స్ టీం తరపున మెర్వే బరిలోకి దిగాడు.
దక్షిణాఫ్రికాపై గెలుపులో కీలక పాత్ర
దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సాధించిన చారిత్రాత్మక విజయంలో మెర్వే కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కు బ్యాటింగ్‌లో మంచి సహకారం అందించాడు. ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు చేసి నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను నడిపించగా, వాన్ డెర్ మెర్వే 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఎడ్వర్డ్స్‌కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల నుంచి డచ్ జట్టు మంచి స్కోరు సాధించింది. వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెర్వే తన తొమ్మిది ఓవర్ల స్పెల్‌లో కేవలం 34 పరుగలుు ఇచ్చి రెండు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా సారధి బవూమా, వాన్‌డెర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా కేవలం 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు పునరాగమనం చేసే అవకాశం రాలేదు. వాన్ డెర్ మెర్వే తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో తాను గతంలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టునే మట్టికరిపించాడు.