భారత పొట్టి క్రికెట్‌ ఫార్మట్‌లో మరో కొత్త రికార్డు నమోదైంది. టీ20 క్రికెట్‌లో ఇటీవల రికార్డుల పరంపర కొనసాగుతోంది.  ఇప్పుడు ఈ జాబితాలో అశుతోష్ శర్మ అనే భారత ఆటగాడి పేరు కూడా చేరింది. 16 ఏళ్ల కిందట టీ 20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్‌ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ రికార్డు మరోసారి బద్దలైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ యువీ రికార్డును బద్దలు కొట్టాడు. 25ఏళ్ల అశుతోష్‌ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్‌ ఎనిమిది సిక్స్‌లు, ఒక బౌండరీతో వీర విహం చేసి కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. కానీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే అశుతోష్‌ పెవిలియన్‌ చేరాడు.



 ఆరు బాల్స్‌.. ఆరు సిక్సర్లు..ఆరు వైవిధ్యమైన షాట్లు..ఇది 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ వీర విహారం. ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటఫ్‌ రెచ్చగొట్టడంతో యువరాజ్‌ సాగించిన విధ్వంసానికి బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడు. బ్రాడ్‌ వేసిన ఆ ఓవర్లో బంతిబంతికి స్టేడియం మార్కోగిపోయింది. ఆ ఓవర్లో యువరాజ్‌ను చూస్తే సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనిపించింది. బంతి వేయాలంటే బ్రాడ్‌ భయపడేలా చేసి... ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన యువీ.. 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే యువీ రికార్డును ఇటీవలే నేపాల్ బ్యాటర్‌ దీపిందర్ సింగ్ ఐరీ బద్ధలు కొట్టగా.. ఇప్పుడు మరో భారత క్రికెటర్ అశుతోష్‌ శర్మ కూడా యువీ రికార్డును బ్రేక్ చేశాడు. రైల్వేస్ బ్యాటర్ ఆశుతోష్ శర్మ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ప్లేయర్ దీపిందర్ సింగ్ ఐరీ.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు . 



 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా అక్టోబర్17న రాంచీలో అరుణాచల్ ప్రదేశ్, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశుతోష్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం12 బంతులు ఆడిన ఆశుతోష్ శర్మ 53 పరుగులు చేశాడు. అశుతోశ్‌ తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో 8 సిక్సులు, ఒక ఫోర్‌ కొట్టాడు. రెండు బాల్స్ డాట్ ఆడిన ఆశుతోష్..12 వ బంతికి అవుటై వెనుదిరిగాడు. ఆశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా రైల్వేస్ చివరి ఐదు ఓవర్లలోనే 115 పరుగులు సాధించింది. ఇదే మ్యాచ్‌లో బ్యాటర్ ఉపేంద్రయాదవ్ కూడా మెరుపు సెంచరీతో చెలరేగడంతో రైల్వేస్ 20 ఓవర్లలో 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆశుతోష్.. 29.5 సగటుతో 236 పరుగులు చేశాడు. 25 ఏళ్ల ఆశుతోష్ శర్మ.. దేశవాళీ క్రికెట్‌కు ఇటీవలే పరిచయం అయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశుతోష్.. 2019లో రాజస్థాన్ మీద మొదటి లిస్ట్- ఏ గేమ్ ఆడాడు. ఈ సీజన్‌లో మధ్యప్రదేశ్ నుంచి రైల్వేస్‌కు మారాడు.



 రైల్వే ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు మిగిలి వుండగా అశుతోష్ క్రీజులోకి వచ్చాడు. అప్పటి స్కోరు 131/4. అప్పటికే ఉపేంద్ర యాదవ్‌ (103*; 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు), అశుతోష్‌ సిక్సర్లతో విరుచుకుపడటంతో చివరి ఐదు ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు రాబట్టి 246/5తో ఇన్నింగ్స్‌ను ముగించింది. లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో 127 పరుగుల తేడాతో రైల్వేస్ ఘన విజయం సాధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో రికార్డు నమోదైంది. భారత టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 275/6 స్కోరు చేసింది. 2019లో ముంబయి జట్టు.. సిక్కింపై 258/4 స్కోరు చేసిన రికార్డును ఇప్పుడు పంజాబ్‌ బ్రేక్‌ చేసింది.