నేడు ఢిల్లీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 7 గంటలకు టాస్ వేస్తారు. అయితే ఇటీవల జరిగిన ఆర్సీబీతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఏం చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), ఆర్సీబీకి మధ్య బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ఓ మ్యాచ్ జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఇచ్చిన 164 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో ఛేజ్ చేసి సత్తా చాటింది.
ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఢిల్లీని దగ్గరుండి గెలిపించాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి ఆర్సీబీపై రాహుల్ తాండవం ఆడాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు రాబట్టాడు. దాంతో ఢిల్లీ టీం ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చిన్నస్వామి గడ్డపై కాంతార స్టైల్ సెలబ్రేషన్ చేశాడు రాహుల్. కాంతారా సినిమాలో హీరో రిషభ్ శెట్టి చేసిన సీన్ ను రాహుల్ చిన్నస్వామి స్టేడియంలో రీ క్రియేట్ చేశాడు.
మ్యాచ్ లో బ్యాట్ ను నేలలో దింపుతున్నట్లు.. అంతకుముందు గిరిగీసినట్లుగా చేశాడు. ఈ నేల నాది, ఈ నా గడ్డ. నా అడ్డా. చిన్నప్పటి నుంచి ఇదే పిచ్ పై ఆడి పెరిగినవాడిని. ఇక్కడ ఫుల్ రైట్స్ తనకే ఉందంటూ కేఎల్ రాహుల్ రీ క్రియేట్ చేసిన కాంతారా సీన్ ఆపై సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో రాహుల్ చేసిన కాంతారా విన్యాసం వైరల్ అయింది. అయితే ఆ రోజు సైలెంట్ అయిపోయిన ఆర్సీబీ... నేడు ఢిల్లీపై ఇంకా చెప్పాలంటే రాహుల్ యాక్షన్ పై రివెంజ్ తీర్చుకునే టైమ్ వచ్చింది.
డబుల్ హెడర్ లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న మ్యాచ్ లో ఢిల్లీని ఆర్సీబీ కొడుతోందా..? కానీ ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ పాయింట్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్ కి వెళ్తుంది. ఇది విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్. మరి కొహ్లీ కూడా తన ఢిల్లీ అడ్డాలో చెలరేగి.. చిన్నప్పటి నుంచి ఇక్కడే క్రికెట్ ఆడి పెరిగానని రివేంజ్ తీర్చుకుంటాడా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మొన్న రాహుల్ చేసిన దాన్ని కోహ్లీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాడు. నేడు ఢిల్లీ గడ్డపై ఆర్సీబీని గెలిపించి తన అడ్డా అని.. లెక్క సరిచేస్తూ కాంతారా రీ క్రియేట్ చేస్తాడని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రాహుల్ బెంగుళూరు లో ఆడి పెరిగితే.. కోహ్లీని ఇంతటివాడిని చేసింది ఢిల్లీ మైదానాలే కనుక.. నేటి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.