New Zealand Squad T20 WC: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు గల జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఆ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్తిల్ రికార్డు స్థాయిలో 7వసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. 


గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అయితే తర్వాత నుంచి కివీస్ ఆట గాడితప్పింది. మూడు ఫార్మాట్లలోనూ విఫలమవుతూ వస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేస్తారేమో అని అందరూ భావించారు. అయితే కివీస్ బోర్డు మాత్రం మరోసారి కేన్ పై నమ్మకముంచి.. అతనికే కెప్టెన్సీ అప్పగించింది. 


టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ను కొనసాగించింది. వెటరన్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాంతో అత్యధిక టీ20 ప్రపంచకప్ లు ఆడుతున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2022 ప్రపంచకప్ గప్తిల్ కెరీర్ లో ఏడవది. అతని కన్నా ముందు నాథన్ మెక్ కల్లమ్, రాస్ టేలర్ లు ఆరు ప్రపంచకప్ లలో పాలుపంచుకున్నారు.


న్యూజిలాండ్ గ్రూప్ -1 లో
కివీస్ జట్టు నేరుగా సూపర్- 12కు అర్హత సాధించింది. డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్ఘనిస్థాన్ జట్లతోపాటు గ్రూప్ - 1లో ఉంది. వీటితోపాటు శ్రీలంక, ఐర్లాండ్ లు గ్రూప్-1 లో చేరే అవకాశం ఉంది. 


న్యూజిలాండ్ జట్టు


కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, కాన్వే, ఫెర్గూసన్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, సౌథీ, ఇష్ సోధి.