KL Rahul: ఓపెనర్ గా తననితాను మెరుగుపరచుకోవడానికి, స్ట్రైక్ రేట్ పెంచుకోవడానికి కృషి చేస్తున్నట్లు.. భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ప్రతిసారి గెలవాలనే లక్ష్యంతోనే తాము బరిలోకి దిగుతామని.. అయితే అన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగదని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు ముందు మీడియాతో మాట్లాడాడు. 


భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రోహిత్ కలిసి ఎన్నో శుభారంభాలు అందించాడు. స్టైలిష్ గా ఆడే రాహుల్ టాప్ ఆర్డర్ లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే గత కొంతకాలంగా అతను పరుగులు బాగానే చేస్తున్నప్పటికీ రాహుల్ స్ట్రైక్ రేట్ విషయంపై చర్చ నడుస్తోంది. స్లో బ్యాటింగ్ కారణంగా జట్టు ఇబ్బంది పడుతోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. 
2021 జనవరి తర్వాత అతని స్ట్రైక్ రేట్ దాదాపు 128 గా ఉంది. ఇది మరీ అంత తక్కువ కాకపోయినా అతని నుంచి ఎక్కువ పరుగులు ఆశిస్తున్నారు.


ఎవరూ పర్ ఫెక్ట్ కాదు 


దీనిపైనే రాహుల్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఎవరూ పర్ ఫెక్ట్ కాదని.. ప్రతిఒక్కరూ ఏదో ఒక అంశంపై దృష్టి సారిస్తున్నారని అన్నాడు. జట్టు గెలిచినప్పుడు ఎవరూ స్ట్రైక్ రేట్ గురించి పట్టించుకోరని తెలిపాడు. అయితే తాను స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టానని చెప్పాడు. జట్టులో ఎవరి రోల్ ఏమిటో వారికి స్పష్టంగా తెలుసునని.. అందరూ ఆ దిశగానే పనిచేస్తున్నారని వివరించాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి ఆసియా కప్ లో ఆడిన రాహుల్.. మునుపటి జోరును చూపలేకపోయాడు.


ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం 


ప్రస్తుతం తాను పూర్తి ఫిట్ గా ఉన్నానని.. స్వదేశంలో ఆసీస్ తో సిరీస్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాహుల్ తెలిపాడు. ఒక ఆటగాడికి.. తన కెప్టెన్, కోచ్ ఏమనుకుంటున్నారనేదే ముఖ్యమని.. బయటివారి వ్యాఖ్యలు తాము పట్టించుకోమని చెప్పాడు. ప్రతిసారి ఎవరూ విజయవంతం కారని అన్నాడు. తాము బాగా ఆడనప్పుడు అందరికంటే తమకే ఎక్కువ బాధ కలుగుతుందని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ గెలవడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు. 


నేటి నుంచే ఆసీస్ తో టీ20 సిరీస్


నేటి నుంచి ఆసీస్ తో టీ20 సిరీస్ మొదలుకానుంది. బ్యాటింగ్ లో రోహిత్, రాహుల్ లు భారీ ఇన్నింగ్సులు ఆడాల్సిన అవసరముంది. కోహ్లీ ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు. అది కొనసాగించాలి. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యాలు పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్టార్ పేసర్ బుమ్రా జట్టుతో చేరడం పెద్ద బలం. అతనితోపాటు హర్షల్ పటేల్ అందుబాటులో ఉన్నాడు. భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లతో పేస్ దళం బలంగానే కనిపిస్తోంది. అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ లు స్పిన్ భారం మోయనున్నారు.