Narayan Jagadeesan Record:  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తనను రిటైన్ చేసుకోలేదన్న కసే మరేంటో తెలియదు కానీ ఈ ఇండియన్ ఆటగాడు క్రిెకట్ లో దుమ్ము రేపుతున్నాడు. ఆ ఆటగాడి పేరు నారాయణ్ జగదీశన్. లిస్ట్-ఏ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 


ప్రస్తుతం భారత్ లో విజయ్ హజారే ట్రోఫీ జరుగుతోంది. తమిళనాడు తరఫున ఆడుతున్న జగదీశన్... అరుణాచల్ ప్రదేశ్ పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 277 పరుగులు చేశాడు. ఇందుకు అతను తీసుకున్న బాల్స్ 141 మాత్రమే. అందులో 25 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి.  196 స్ట్రైక్ రేట్. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జగదీశన్ క్రమంలో అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు


లిస్ట్-ఏ క్రికెట్ లో ఈ 277 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు అలిస్టైర్ బ్రౌన్ అనే ఆటగాడు 2002 లో 268 పరుగులు చేశాడు. మహిళల క్రికెట్ లో  శ్రీపాలి వీరక్కొడి 2007లో 271 పరుగులు స్కోర్ చేశారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు జగదీశన్ దే. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం రోహిత్ శర్మ చేసిన 264 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. 


వరుసగా 5 శతకాలు


పురుషుల లిస్ట్-ఏ క్రికెట్ లో వరుసగా 5 ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు. ఇంతకుముందు కుమార సంగక్కర, అల్విరో పీటర్సన్, దేవదత్ పడిక్కల్ నాలుగేసి సెంచరీలు చేశారు. ఈ ఏడాది జగదీశన్ వరుసగా 114, 107, 168, 128, ఇప్పుడు 277 స్కోర్ చేశాడు. అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. 


జట్టు అత్యధిక స్కోరు


జగదీశన్ భారీ ఇన్నింగ్స్ దయతో తమిళనాడు జట్టుకు మరో అరుదైన రికార్డు దక్కింది. మెన్స్ లిస్ట్-ఏ క్రికెట్ లో మొదటిసారిగా ఓ జట్టు 500 పరుగులు దాటింది. ఇప్పటిదాకా ఇంగ్లండ్... నెదర్లాండ్స్ పై చేసిన 498 అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 



  • ఈ 277 పరుగుల ఇన్నింగ్స్ లో జగదీశన్ సెంచరీకి తీసుకున్న బంతులు.... 114. లిస్ట్-ఏ క్రికెట్ లో ఇదే సంయుక్తంగా వేగవంతమైన శతకం. ఇంతకుముందు రికార్డు కూడా 114 బంతులే. ఇప్పుడు జగదీశన్ దాన్ని సమం చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా గతంలో 114 బంతుల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. 

  • ఈ మ్యాచ్ లో జగదీశ్, సాయి సుదర్శన్ మధ్య 416 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది. లిస్ట్-ఏ క్రికెట్ లో ఏ వికెట్ కైనా 400 పార్టనర్ షిప్ నమోదవడం ఇదే తొలిసారి. 

  • ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ ఇప్పటిదాకా 799 పరుగులు చేశాడు. ఇది రెండో అత్యధికం. ప్రస్తుత రికార్డు 827 పరుగులతో పృథ్వీ షా పేరు మీద ఉంది. ఈ సీజన్ లో ఇంకా మ్యాచులు ఉన్నాయి కాబట్టి జగదీశన్ ఆ రికార్డు దాటే అవకాశాలు ఉన్నాయి.



మొత్తం మీద చూసుకుంటే మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ వేలం ముందు... తాను అద్భుతమైన ఫాంలో ఉన్నానని జగదీశన్ నిరూపించుకుంటున్నాడు. సీఎస్కే తనను వదిలేసుకుందని బాధపడక్కర్లేదన్నమాట. ఈ ఫాం ప్రకారం వేలంలో ఇతని కోసం భారీ మొత్తం వెచ్చించే అవకాశం లేకపోలేదు.